ప్రపంచంతోనే తెలంగాణ పోటీ.. అదే మా ప్రభుత్వ విధానం

ప్రపంచంతోనే తెలంగాణ పోటీ.. అదే మా ప్రభుత్వ విధానం
  • పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం
  • తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయండి
  • 2050 విజన్‌తో మాస్టర్ ప్లాన్
  • హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చంద్రబాబు, వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌
  • గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం
  • సీఐఐ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్‌ : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ విద్యా, నైపుణ్యాభివృద్ధి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. పారిశ్రామివేత్తలు తమ అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసేందుకు ఉపయోగించాలని కోరారు. 2050 విజన్‌తో తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం మొత్తం సింగిల్ యూనిట్‌గా ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఓఆర్‌ఆర్‌, త్రిపుల్ ఆర్ మధ్య డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.


ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుతోపాటు అక్కడి ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని, నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా రూ.2000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్స్ ఇవ్వబోతున్నామని చెప్పారు. జహీరాబాద్‌లో నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇంజినీరింగ్ వాళ్లు కూడా 15వేలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటప్పుడు స్కిల్ విషయంలో ఎక్కడో గ్యాప్ ఉందని భావించాల్సి వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. తాము ప్రారంభించబోయే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఆ గ్యాప్‌ను భర్తీ చేస్తాయని భావిస్తున్నానని తెలిపారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడదే హైదరాబద్‌కు లైఫ్‌లైన్‌గా మారిందన్నారు. డిఫరెంట్ ఇన్వెస్టర్లను క్లస్టర్లుగా విభజించనున్నామన్నారు.