వరంగల్‌ నుంచి పోటీ చేయలేను.. కేసీఆర్‌కు కడియం కావ్య లేఖ.. నేడు కాంగ్రెస్‌లోకి?

సాయంత్రం కేకే షాక్‌.. కాసేపటికే కావ్య ఝలక్‌

వరంగల్‌ నుంచి పోటీ చేయలేను.. కేసీఆర్‌కు కడియం కావ్య లేఖ.. నేడు కాంగ్రెస్‌లోకి?

తండ్రి శ్రీహరితో కలిసి నేడు కాంగ్రెస్‌లోకి?

ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలిచే చాన్స్‌

విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధిః వ‌రుస‌దెబ్బ‌ల‌తో ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ కు స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తె, వ‌రంగ‌ల్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్ధి డాక్ట‌ర్ క‌డియం కావ్వ గ‌ట్టి షాకిచ్చారు. పిలిచి బీఆర్ఎస్ అధిష్టానం వ‌రంగ‌ల్ ఎంపీగా పోటీచేసే అవ‌కాశం క‌ల్పిస్తే రాజ‌కీయంగా పార్టీ ఎదుర్కొంటున్న తాజా ప‌రిస్థితుల్లో పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి తెర‌తీశారు. ఈ మేర‌కు కావ్య పార్టీ అధినేత కేసీఆర్ కు గురువారం రాత్రి లేఖ రాశారు. బీఆర్ఎస్ అధ్య‌క్షులు కెసీఆర్ పేరుతో రాసిన ఈ లేఖ‌లో ఆమె ప్ర‌స్తావించిన అంశాలు, కార‌ణాలు తీవ్ర‌క‌ల‌క‌లం రేపుతున్నాయి. లేఖ‌లో వివ‌రాలిలా ఉన్నాయి. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ అభ్య‌ర్ధిగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ‌త కొన్ని రోజులుగా పార్టీ నాయ‌క‌త్వం పై మీడియాలో వ‌స్తున్న అవినీతి, భూ క‌బ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్య‌వ‌హారాలు మ‌రియు లిక్క‌ర్ స్కాం లాంటి విష‌యాలు పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చాయి. జిల్లాలోని నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, స‌హ‌కారం లేక‌పోవ‌డం, ఎవ‌రికి వారే య‌మునా తీరేఅన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం పార్టీకి మ‌రింత న‌ష్టం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విర‌మించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. కెసీఆర్‌, పార్టీ నాయ‌క‌త్వం బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు న‌న్ను మ‌న్నించవ‌లిసిందిగా కోరుతున్నానంటూ ఈ లేఖ‌లో క‌డియం కావ్య పేర్కొన్నారు.

సంచ‌ల‌నంగా మారిన లేఖ‌

క‌డియం కావ్య పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంతో పాటు తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా ఉన్న క‌డియం శ్రీ‌హ‌రి రాజ‌కీయ వార‌సురాలిగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి, ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని గ‌త కొన్నేళ్ళుగా క‌డియం శ్రీ‌హ‌రి, ఆయ‌న కుమార్తె తీవ్ర‌ప్ర‌య‌త్నాలు చేసింది. ప్ర‌ధానంగా శ్రీ‌హ‌రి రాజ‌కీయ వార‌సురాలిగా స్టేష‌న్ ఘ‌న్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావించారు. ఈ మేర‌కు బాహాటంగానే ప్ర‌య‌త్నాలు చేశారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ నుంచి మొన్న‌టి వ‌ర‌కు డాక్ట‌ర్ రాజ‌య్య ప్రాతినిధ్యం వ‌హించ‌డంతో ఆయ‌న స్థానంలో కావ్య‌ను బ‌రిలో నిలిపేందుకు అవ‌కాశం ద‌క్క‌లేదు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో రాజ‌య్య‌ను త‌ప్పించి బీఆర్ఎస్ అధిష్టానం శ్రీ‌హ‌రికి అవ‌కాశం క‌ల్పిచ‌డం, ఆయ‌న గెలుపొంద‌డం జ‌రిగింది. ఈ స్థితిలో కావ్య రాజ‌కీయ రంగ ప్ర‌వేశం వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌రుగుతోంద‌ని అంతా భావించారు. కానీ, రాష్ట్రంలో చ‌క‌చ‌క జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌కు తోడు క‌డియం శ్రీ‌హ‌రి ఛ‌క్ర‌తిప్ప‌డంతో త‌న కుమార్తె కావ్య‌కు వ‌రంగ‌ల్ ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ద‌క్కింది. ఒక విధంగా ప్ర‌తికూల రాజ‌కీయ ప‌రిస్థితుల్లోనే కావ్య‌కు ఈ ఛాన్స్ ల‌భించింది. కావ్య‌కు పోటీగా కొంద‌రు ఉద్య‌మకారులు, వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ టికెట్ ఆశించిన‌ప్ప‌టికీ బీఆర్ ఎస్ అధిష్టానం కావ్య అభ్య‌ర్ధిత్వం వైపు మొగ్గు చూపారు. దీంతో అటు ఉద్య‌మ‌కారులు నారాజ్ అయ్యారు. అరూరి ర‌మేష్ ఏకంగా పార్టీ మారి బీజేపీ అభ్య‌ర్ధిగా రంగంలో నిలిచారు.

కావ్య అభ్య‌ర్ధిత్వం వెనుక ట్విస్ట్

కావ్య అభ్య‌ర్ధిత్వం వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూప‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాలున్నాయి. కావ్య అభ్య‌ర్ధిత్వాన్ని ఎంపిక‌చేయ‌డం వెనుక కేసీఆర్ ముందు చూపుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌రంగ‌ల్ అభ్య‌ర్ధి ఎంపిక‌కు ముందే రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న క‌డియం శ్రీ‌హ‌రి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నార‌నే ప్ర‌చారం సాగింది. క‌డియం శ్రీ‌హ‌రికి కాంగ్రెస్ ఆహ్వానం ప‌లికింద‌నే చ‌ర్చ సాగింది. కార‌ణాలేవైనా క‌డియం కాంగ్రెస్ లో చేర‌లేదు. ఈ ప‌రిణామాల‌ను గుర్తించిన కేసీఆర్ సైతం క‌డియాన్ని కాపాడుకునేందుకు కావ్య‌కు ఎంపీ టికెట్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు చ‌ర్చ సాగింది. కానీ, ప‌రిస్థితులు రోజురోజుకు మారిపోవ‌డం, బీఆర్ఎస్ ప్ర‌తిష్ట దిగ‌జార‌డంతో పాటు కాంగ్రెస్ నుంచి మ‌రోసారి ఆహ్వానం రావ‌డంతో కావ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన‌ట్లు భావిస్తున్నారు. ఎప్ప‌టి నుంచో రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి ప్ర‌య‌త్నిస్తున్న కావ్యకు వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకోకుండా ఆక‌స్మికంగా పోటీ నుంచి త‌ప్పుకోవ‌డం వెనుక మ‌త‌ల‌బున్న‌ట్లు చెబుతున్నారు. పైగా సాధార‌ణ స‌భ్యురాలు కూడా కాని కావ్య పార్టీ పై చేసిన ఆరోప‌ణ‌లు, పేర్కొన్న అంశాలు తీవ్ర‌మైన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. పైకి కావ్య ప్ర‌క‌ట‌న‌గా క‌నిపించిన‌ప్ప‌టికీ దీని వెనుక క‌డియం హ‌స్తం లేకుండా జ‌రుగ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు.

కాంగ్రెస్ లో చేరనున్న క‌డియం, కావ్య‌?

తెలంగాణ‌లో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రితో పాటు, క‌డియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలున్న‌ట్లు చెబుతున్నారు. ఈ మేర‌కు వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్ధిని కూడా కాంగ్రెస్ ఈ కార‌ణంగానే నిర్ణ‌యించ‌లేద‌నే చ‌ర్చ సాగుతోంది. శ్రీ‌హ‌రితో పాటు కావ్య కాంగ్రెస్ లో చేరితే కావ్య‌ను వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్ధిగా ఎంపిక చేయ‌నున్నట్లు చెబుతున్నారు. ఈ మేర‌కు అంత‌ర్గ‌తంగా ఒప్పందం జ‌రిగిన త‌ర్వాత‌నే ఈ లేఖ రాసిన‌ట్లుగా భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ హరీశ్‌ చౌదరి గురువారం హైదరాబాద్‌ వచ్చారు. కడియం శ్రీహరి, కావ్యలతో ఆయన చర్చించారని, కావ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారమే కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.