టాలీవుడ్‌కి గుడ్ న్యూస్ చెప్పిన కోమటిరెడ్డి..నంది అవార్డ్‌లపై కీలక ప్రకటన

ఒకప్పుడు సినీ ప్రముఖుల ప్రతిభని గుర్తించి నంది అవార్డ్‌లు ఇచ్చేవారు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఊసే లేదు. దీనిపై పలుమార్లు ప్రస్తావన వచ్చిన కూడా ఎందుకు నంది అవార్డ్ వేడుక అనేది జరగలేదు. అయితే తాజాగా దీనిపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2024 ఉగాది నుంచి నంది అవార్డులను అధికారికంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వచ్చే ఏడాది ఉగాదికి పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చించినట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి .. మురళీమోహన్‌ని నటసింహ చక్రవర్తి బిరుదుతో సత్కరించారు. ఆ సమయంలో మురళీ మోహన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇవ్వాలని విన్నవించడంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. 2024 ఉగాది నుంచి నంది అవార్డులను రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలియజేశారు. కోమటిరెడ్డి నంది అవార్డ్‌ల విషయంలో సానుకూలంగా స్పందించడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాష్ట్ర విభజన తరువాత కళాకారులకు నంది అవార్డుల ప్రస్తావనే లేకుండా పోయింది. కొందరు ప్రముఖులు నంది అవార్డ్‌ల విషయంలో ఎన్ని సార్లు బాహటంగా అడిగిన కూడా దాని గురించి మాట్లాడిన వారు లేరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది ఉగాది నుండి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వగా, వారు దీనిని ఎలా ముందుకు తీసుకు వెళతారో చూడాలి.