Jammu Kashmir | కశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్..

Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి నగదు, గ్రేనెడ్లను స్వాధీనం చేసుకున్నారు.
బారాముల్లాలోని ఉష్కారా ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఉష్కారా చెక్‌పాయింట్ వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భద్రతా సిబ్బందిని గమనించిన ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని ఉష్కారాకు చెందిన ముదాసిర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. అహ్మద్ భట్ నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రూ. 40 వేల నగదుతో పాటు మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.