మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ జోషి ఇక లేరు

మహారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి మ‌నోహర్ జోషి(86) ఇక లేరు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరిన జోషి.. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ జోషి ఇక లేరు

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి మ‌నోహర్ జోషి(86) ఇక లేరు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరిన జోషి.. చికిత్స పొందుతూ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు పీడీ హిందూజా హాస్పిట‌ల్ అధికారికంగా ప్ర‌క‌టించింది. జోషి అంత్య‌క్రియ‌లు ముంబైలోని శివాజీ పార్కు స్మ‌శాన‌వాటిక‌లో జ‌ర‌గ‌నున్నాయి. మ‌నోహ‌ర్ జోషి మృతిప‌ట్ల ఆయా పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

జోషి రాజ‌కీయ ప్ర‌స్థానం..

మ‌నోహ‌ర్ జోషి టీచ‌ర్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత 1967లో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. శివ‌సేన పార్టీలో 40 ఏండ్ల పాటు కొన‌సాగారు. 1968-70 మ‌ధ్య కాలంలో ముంబై మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా, 1970లో స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా ప‌ని చేశారు. 1976 నుంచి 1977 వ‌ర‌కు ముంబై మేయ‌ర్‌గా సేవ‌లందించారు. 1972లో మహారాష్ట్ర శాస‌న‌మండ‌లికి ఎన్నిక‌య్యారు. వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. 1990లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1990-91 మ‌ధ్య కాలంలో మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా కొన‌సాగారు. 1999 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముంబై నార్త్ సెంట్ర‌ల్ నుంచి శివ‌సేన త‌ర‌పున లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా..

1995 నుంచి 1999 వ‌ర‌కు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా మ‌నోహ‌ర్ జోషి ప‌ని చేశారు. అయితే శివ‌సేన నుంచి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన తొలి వ్య‌క్తి జోషినే. వాజ‌పేయి ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో 2002 నుంచి 2004 వ‌ర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ప‌ని చేశారు. జోషి మ‌హారాష్ట్ర‌లోని రాయ‌గ‌ఢ్ జిల్లాలోని నంద్వి గ్రామంలో 1937, డిసెంబ‌ర్ 2వ తేదీన జ‌న్మించారు. విద్యాభ్యాసమంతా ముంబైలో కొన‌సాగింది. జోషి భార్య అన‌ఘా.. 2020లో చ‌నిపోయారు. అప్పుడు ఆమె వ‌య‌సు 75 ఏండ్లు. జోషికి కుమారుడు, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు.