మ‌ద్యం బాటిళ్ల‌కు అద‌నం రూ. 50 వ‌సూళ్లు.. మందుబాబు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. వీడియో

మ‌ద్యం బాటిళ్ల‌పై అద‌నంగా డ‌బ్బులు వ‌సూళ్లు చేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఓ మందుబాబు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. చెట్టుపైకి ఎక్కిన అత‌ను కింద‌కు దూకుతానంటూ బెదిరించాడు.

మ‌ద్యం బాటిళ్ల‌కు అద‌నం రూ. 50 వ‌సూళ్లు.. మందుబాబు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. వీడియో

భోపాల్ : మ‌ద్యం బాటిళ్ల‌పై అద‌నంగా డ‌బ్బులు వ‌సూళ్లు చేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఓ మందుబాబు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. చెట్టుపైకి ఎక్కిన అత‌ను కింద‌కు దూకుతానంటూ బెదిరించాడు. ఈ ఘ‌ట‌న మధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌గ‌ర్హ్ జిల్లాలో మంగ‌ళ‌వారం వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్‌గ‌ర్హ్ జిల్లాకు చెందిన బ్రిజ్‌మోహ‌న్ శివ్‌హ‌రే అనే వ్య‌క్తి మ‌ద్యానికి బానిస అయ్యాడు. అయితే అత‌ను మ‌ద్యం బాటిళ్ల‌ను కొనుగోలు చేసేందుకు వైన్స్ దుకాణానికి వెళ్లాడు. బీర్‌పై అద‌నంగా రూ. 30, క్వార్ట‌ర్ బాటిల్‌పై అద‌నంగా రూ. 20 వ‌సూళ్లు చేశారు. దీంతో బ్రిజ్‌మోహ‌న్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యించిన ధ‌ర‌ల కంటే అధిక ధ‌ర‌ల‌కు మ‌ద్యం విక్ర‌యిస్తున్నార‌ని బ్రిజ్‌మోహ‌న్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సీఎం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా లోక‌ల్ పోలీసుల‌కు, క‌ల‌క్ట‌ర్‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆ మందుబాబు మంగ‌ళ‌వారం ఓ భారీ వృక్షాన్ని ఎక్కాడు. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌కే మ‌ద్యం విక్ర‌యించాల‌ని, లేదంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించాడు. మొత్తానికి స్థానికుల స‌హాయంతో పోలీసులు అత‌న్ని క్షేమంగా కింద‌కు దించారు.

ఫిర్యాదు చేసినందుకు దాడి చేశారు..

ఈ సంద‌ర్భంగా బ్రిజ్ మోహ‌న్ మాట్లాడుతూ.. మ‌ద్యం దుకాణదారులు దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. వారి ఆగ‌డాల‌పై ఫిర్యాదు చేస్తే కొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని వాపోయాడు. గ‌త రెండు నెల‌ల నుంచి ఎలాంటి ప‌ని లేదు. క‌నీసం ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా డ‌బ్బుల్లేవు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ద్యం అధిక ధ‌ర‌కు అమ్మ‌డం స‌రికాద‌న్నారు. తాను క‌లెక్ట‌ర్, పోలీసుల‌కు ఫిర్యాదు చేసినందుకు మ‌ద్యం దుకాణ‌దారులు త‌న‌ను కొట్టార‌ని తెలిపాడు. రిప‌బ్లిక్ డే నాడు, రామ‌మందిరం ప్రారంభోత్స‌వం రోజున కూడా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిపార‌ని బ్రిజ్ మోహ‌న్ తెలిపాడు.