మ‌రొక‌రితో పెళ్లి.. ప్రియురాలిని కాల్చిచంపిన ప్రియుడు

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన త‌న‌ను కాద‌ని మ‌రొక‌రితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన ప్రియురాలిని ప్రియుడు తుపాకీతో కాల్చిచంపాడు.

మ‌రొక‌రితో పెళ్లి.. ప్రియురాలిని కాల్చిచంపిన ప్రియుడు

ల‌క్నో : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన త‌న‌ను కాద‌ని మ‌రొక‌రితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన ప్రియురాలిని ప్రియుడు తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షార్ జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బులంద్‌షార్ జిల్లాలోని న‌య‌వాస్ గ్రామానికి చెందిన నేహా విజ‌య్‌పాల్ సింగ్‌(28) అనే యువ‌తిని టిటూ వీర్‌పాల్ సింగ్‌(30) అనే యువ‌కుడు కొంత‌కాలంగా ప్రేమిస్తున్నాడు. నేహా టిటూ ప్రేమ‌ను అంగీక‌రించింది కూడా. అయితే వీరి ప్రేమ విష‌యం తెలిసి.. నేహాను ఆమె కుటుంబ స‌భ్యులు మంద‌లించారు.

ఇక మ‌రో వ్య‌క్తితో నేహా పెళ్లి చేసేందుకు కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌య్యారు. ఈ విష‌యం తెలుసుకున్న టిటూ కోపంతో ర‌గిలిపోయాడు. నేహా ఇంటికి సోమ‌వారం ఉద‌యం చేరుకుని, తుపాకీతో ఆమెను కాల్చిచంపాడు టిటూ. అనంత‌రం అక్క‌డిక‌క్క‌డే తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు న‌యావాస్ గ్రామానికి చేరుకున్నారు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిఉన్న ఇద్ద‌రి మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.