కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 14 ఏళ్ల బాలుడు

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 14 ఏళ్ల బాలుడు

అమితాబ్ బ‌చ్చన్ హోస్ట్‌గా గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న రియాలిటీ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. ఈషో ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షో ఆధారంగానే ప‌లు ప్రాంతీయ భాష‌ల‌లో క్విజ్ గేమ్ షోలు వ‌చ్చాయి. అయితే కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి షోతో కొంద‌రు మాత్ర‌మే క‌రోడ్ ప‌తిలుగా మార‌డం మ‌నం చూశాం. అయితే ఇప్పుడు షోలో 14 ఏళ్ల బాలుడు కోటి రూపాయ‌లు గెలుచుకొని స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. కోటి రూపాయలను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా అత‌ని ఖాతాలో స‌రికొత్త రికార్డ్ చేసింది.

హర్యానాకు చెందిన మయాంక్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్ర‌త్యే కేబీసీ జూనియర్ వీక్ సందర్భంగా మయాంక్ పోటీదారుగా పాల్గొన‌గా, అత‌ని టాలెంట్ చూసి అంద‌రు అవాక్క‌య్యారు. ప్ర‌స్తుతం మ‌యాంక్ 8వ త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గా, అత‌ను రూ. 3.2 లక్షల వరకు ఒక్క లైఫ్‌లైన్‌ను కూడా ఉపయోగించలేదు. ఆ తర్వాత రూ. 12.5 లక్షల ప్రశ్న కోసం మొదటిసారి లైఫ్‌లైన్‌ని ఉపయోగించుకొని ముందుకు సాగాను. కోటి రూపాయల మెగా ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో మయాంక్ కోటిశ్వ‌రుడిగా అవ‌త‌రించాడు. ఇంత‌కు ఆ ప్ర‌వ్న ఏంటంటే.. ‘కొత్తగా కనుగొన్న అమెరికా అనే ఖండం మ్యాప్‌ను రూపొందించిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్‌కు దక్కుతుంది’ ?

ప్ర‌శ్న‌కి స‌మాధానంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. A- అబ్రహం ఒర్టెలియస్, B- గెరాడస్ మెర్కేటర్, C- గియోవన్నీ బాటిస్టా అగ్నిసి,D- మార్టిన్ వాల్డ్సిముల్లర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మార్టిన్ వాల్డ్‌సీముల్లర్. మయాంక్ దీనికి సరైన సమాధానం చెప్పి కోటి రూపాయలను గెలుచుకున్నాడు మ‌యాంక్. ఆ తర్వాత ఏడు కోట్ల రూపాయల ప్రశ్న అడ‌గ‌గా, దానికి స‌రైన సమాధానం తెలియకపోవడంతో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొని కోటి రూపాయ‌లు ద‌క్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో మ‌యాంక్‌ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అభినందించారు. ఇంత పెద్ద మొత్తంలో గెలవడం త‌న‌కు ,త‌న కుటుంబానికి చాలా గర్వకారణం. ఎల్లప్పుడూ నన్ను నడిపిస్తున్నందుకు నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే గేమ్‌లో న‌న్ను ఎంతో ప్రోత్స‌హించిన అమితాబ్‌కి కూడా కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాను అని మ‌యాంక్ అన్నారు.