వ‌ర‌ల్డ్ క‌ప్‌పై కాళ్లు పెట్టడం మీద మిచెల్ తాజా కామెంట్స్

వ‌ర‌ల్డ్ క‌ప్‌పై కాళ్లు పెట్టడం మీద  మిచెల్ తాజా కామెంట్స్

వ‌న్డే వ‌ర‌ల్డ్ కప్ 2023లో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించి క‌ప్ గెలుచుకుంది. ఆరోసారి ఆస్ట్రేలియాకి క‌ప్ ద‌క్క‌డంతో వారి సంబురాలు అంబురాన్నంటాయి. అయితే క‌ప్ అందుకున్న త‌ర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్న స‌మయంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ ట్రోఫీపై కాళ్లు పెట్టి, చేతిలో బీరు బాటిల్ తో క‌నిపించాడు. ఈ పిక్ సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. మార్ష్ తీరుపై చాలా మంది క్రికెట్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క్రికెటర్ మహ్మద్ షమీ కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదానికి కారణమైన మిచెల్ మార్ష్ ఎట్టకేల‌కి స్పందించారు.

ఓ ఇంట‌ర్వ్యూలో మార్ష్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టి నేను దిగిన ఫొటోలో ఎలాంటి అగౌరవం నాకు కనిపించలేదని మార్ష్ తెలియ‌జేశాడు. నేను ఈ విషయం గురించి ప‌ట్టించుకోలేదు. అది వైరల్‌ అయ్యిందని కొందరు నాకు చెబుతున్నప్పటికీ నేను సోషల్‌ మీడియాలో దానిని పెద్దగా చూడలేదు. అందులో ఏమీ లేదని మార్ష్ స్ప‌ష్టం చేశాడు. తానేమీ వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేయలేదని చెప్పిన మార్ష్… కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని స్పష్టం చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదని కూడా అన్నాడు. దాని గురించి అంత‌లా మాట్లాడుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఏముంద‌ని కూడా చెప్పుకొచ్చాడు.

అయితే మార్ష్ తీరుపై అస‌హ‌నం చెందిన ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్‌ పండిట్‌ కేశవ్ మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు ఫిర్యాదులో పేర్కొనగా, ఆ ఫిర్యాదుని స్వీక‌రించిన ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు కూడా ఆయన ఫిర్యాదు చేయ‌డం కొస‌మెరుపు.