మమ్మల్ని వీడియో తీయడమేనా.. ఓటు వేయరా? మీడియాపై జూనియర్ ఎన్టీఆర్ ఫైర్

తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసిన ఎన్నికలు వచ్చేసాయి. ఐదేళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టడం కోసం జరిగే ఎన్నికలు రాష్ట్రంలో ప్రారంభం కాగా, ఎన్నికలలో ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఓటర్లు క్యూ లైన్‌లలో నిల్చుని ఓటు హక్కులను వినియోగించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లిహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్ బూత్ నెంబర్ 150లో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ క్యూ లైన్‌లో కనిపించి సందడి చేశారు. అయితే ఎన్టీఆర్ బూత్ కి వచ్చిన సమయంలో కెమెరామెన్ లు చుట్టుముట్టే సరికి ఆయనలో ఓపిక నశించి.. మీరందరూ ఇక్కడే ఉంటారా..? ఓటు వేయరా అని అడిగాడు. అప్పుడు వారు మీరు వెళ్లిపోయాక మేం ఓట్లు వేస్తామని ఎన్టీఆర్ కి కెమెరామెన్లు బదులిచ్చారు. టైమ్ సరిపోతుందా అని ఎన్టీఆర్ మరో ప్రశ్న వేశారు, సరిపోతుందంటూ కెమెరామెన్లు సమాధానం ఇచ్చారు. పక్కనే ఉన్న మరొక వ్యక్తి .. ఇందులో సగం మంది వేస్తారు, సగం మంది వేయరు అని సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఎన్టీఆర్‌తో పాటు చాలా మంది సెలబ్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ సింగిల్ గానే పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసారు. ఇక అలానే జూబ్లీహిల్స్ క్లబ్‌లో సుమంత్ ఓటు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా తన ఓటు వినియోగించుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ, కూతురు శ్రీజతో కలిసి ఓటు వేసారు. సామాన్యులతో పాటు చాలా సేపు లైన్‌లో నిల్చున్నారు. అనంతరం తన ఓటు వేసి తిరుగు ప్రయాణం అయ్యారు. విక్టరీ వెంకటేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్శకుడు తేజ కూడా ఓటు హక్కును వాడుకున్నారు. రానా దగ్గుబాటి, నరేష్, నాని, రామ్, రాజమౌళి, ఇలా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు