మళ్లీ గర్జించిన సౌతాఫ్రికా సింహాలు.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్

ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న జట్లలో స్ట్రాంగ్‌గా ఉన్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ బుధవారం పోటీపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అందరు భావించారు. కాని గేమ్ ఏకపక్షంగా సాగింది. ఆస్ట్రేలియాపై భారీ స్కోరు చేసిన కివీస్.. సౌతాఫ్రికాపై చేతులెత్తేసింది.35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో సెమీస్ అవకాశాలని సంక్లిష్టం చేసుకుంది. మొదట్లో వరుసగా నాలుగు విజయాలతో పటిష్టంగా కనిపించిన కివీస్ ఆ తర్వాత వరుస పరాజయాలు చవి చూస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, పసికూన నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించి స్ట్రాంగ్ అనిపించిన న్యూజిలాండ్ జట్టు భారత్, ఆస్ట్రేలియాతో పాటు తాజాగా సౌతాఫ్రికా చేతిలోను ఓటమి పాలైంది.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు వరకు టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలు కావడంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఘోర పరాజయంతో రన్ రేట్ కూడా తగ్గింది. ఇప్పుడు కివీస్ సెమీస్ చేరాలి అంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పని సరిగా మంచి రన్‌రేట్‌తో గెలవాల్సిన పరిస్థితి ఉంది. కివీస్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లని పాకిస్థాన్‌తో(నవంబర్ 4న), శ్రీలంకతో నవంబర్ 9న ఆడనుంది. ఈ రెండింటిలో గెలిస్తే 12 పాయింట్లతో సెమీస్ బెర్త్ కన్‌ఫాం అవుతుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్‌లో ఓడిన కూడా ఇతర టీం ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఇతర మ్యాచ్‌ల్లో ఓడిపోతే అప్పుడు న్యూజిలాండ్‌కి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ ఒక్కటి గెలిచినా.. రన్ రేట్ కీలకంగా మారుతుంది.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. క్వింటన్ డికాక్(116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114), రాసీ వాన్ డెర్ డస్సెన్(118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133) అద్భుతమైన సెంచరీలు చేయడంతో పాటు చివరలో డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) మెరుపులు మెరిపించడంతో ఆ స్కోరు లభించింది. ఇక లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ ని కేశవ్ మహరాజ్(4/46), మార్కో జాన్సెన్(3/31) దెబ్బ కొట్టారు. గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60 నాటౌట్) తప్ప మిగతా వారందరు నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయి 190 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.