ఒబెరాయ్ గ్రూప్ చైర్మ‌న్ పృథ్వీరాజ్ సింగ్ క‌న్నుమూత‌

ఒబెరాయ్ గ్రూప్ చైర్మ‌న్ పృథ్వీరాజ్ సింగ్ క‌న్నుమూత‌

ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ చైర్మ‌న్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) క‌న్నుమూశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం పృథ్వీ రాజ్ సింగ్‌ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఒబెరాయ్ గ్రూప్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఒబెరాయ్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్ వెల్ల‌డించింది. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఫామ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించింది.

1929, ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఒబెరాయ్ ఢిల్లీలో జ‌న్మించారు. ఆయ‌న బికిగా పాపుల‌ర్. డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్ త‌న మాధ్య‌మిక విద్య‌ను పూర్తి చేశారు. స్విట్జ‌ర్లాండ్‌లోని ఓ యూనివ‌ర్సిటీ నుంచి హోట‌ల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ప‌ట్టా పుచ్చుకున్నారు.

ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్తరూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. దేశంలోనే కాదు అనేక దేశాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహిస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ఒబెరాయ్ హోటల్స్ , రిసార్ట్స్ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించారు. అలా ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో ఒబెరాయ్ కీలక పాత్ర పోషించారు. ఒబెరాయ్ బ్రాండ్ లగ్జరీ హోటళ్లకు కెరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇక ఒబెరాయ్‌ తన కెరీర్‌లో అనేక అవార్డులను, ప్రశంసలను అందుకున్నారు. పర్యాటకం, ఆతిథ్యంలో దేశానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఒబెరాయ్‌కు 2008లో భారత్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో స‌త్క‌రించింది. ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు కూడా వరించాయి.