సలార్ రిలీజ్ సమయంలో విషాదం.. ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్తో 27ఏళ్ల అభిమాని మృతి

ఇప్పుడు ఎక్కడ చూసిన సలార్ హంగామా నడుస్తుంది.ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా సలార్ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. సినిమాపై ముందు నుండే అంచనాలు భారీగా ఉండడంతో సినిమాని చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య బలమైన స్నేహ బంధాన్ని చూపిస్తూ కళ్ళు చెదిరే విజువల్స్ తో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా మలిచారు. మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ సమయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని అయిన బాలరాజు (27) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు కలిసి సలార్ రిలీజ్ సందర్భంగా ఫ్లేక్సీ ఫ్రేమ్ తయారు చేయించి వారే కట్టడానికి ప్రయత్నించారు. అయితే ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకడంతో కరెంట్ షాక్కు గురై బాలరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. గజేంద్ర అనే యువకుడు గాయపడ్డాడు.
మరో నలుగురు యువకులు ప్రమాదం నుండి బయటపడ్డట్టు సమాచారం.అయితే కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. బాలరాజు కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటూ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభాస్ అభిమాని అయిన బాలరాజు ఇలా హఠాన్మరణం చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.