డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామచంద్రనాయక్
డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామచంద్ర నాయక్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న డోర్నకల్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ రామ్ చంద్ర నాయక్ ను పార్టీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు డాక్టర్ రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్, భూపాల్ నాయక్ లు చివరి వరకు పోటీ పడగా రామచంద్రనాయక్ వైపు మొగ్గు చూపారు. 2018 ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి రామచంద్రనాయక్ పోటీ చేశారు. పార్టీకి నమ్మకస్తుడిగా భావించడంతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా ఉపకరించే అవకాశం ఉన్నందున రామచంద్రనాయక్ వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. ముగ్గురితోపాటు మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన గిరిజన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ కూడా ఒక దశలో డోర్నకల్ స్థానం కేటాయించాలని కోరారు. ఇదేమి పట్టించుకోకుండా రామచంద్రునాయక్ కే టికెట్ కేటాయించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది.