ప్రముఖ న్యాయ నిపుణుడు ఫాలీ నారీమన్ ఇకలేరు..
ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్(95) ఇక లేరు. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో నారీమన్ తుదిశ్వాస విడిచారు.

న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్(95) ఇక లేరు. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో నారీమన్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని పార్శీ ఆరాంగహ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఫాలీ నారీమన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఆయా రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు, జడ్జిలు సంతాపం ప్రకటించారు.
నారీమన్ మొదట బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన కేరీర్‌ను పరారంభించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. 1972లో అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియామకం అయ్యారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ తన పదవికి నారీమన్ రాజీనామా చేశారు. 1991 నుంచి2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
నారీమన్ కుమారుల్లో ఒకరైన జస్టిస్ రోహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2011 నుంచి 2013 వరకు రోహింటన్ కూడా సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు.