సీసీఎల్ క్రికెట్ లీగ్.. తొలి మ్యాచ్‌లో దంచి కొట్టిన తెలుగు వారియర్స్.. ఘ‌న విజ‌యం

సీసీఎల్ క్రికెట్ లీగ్.. తొలి మ్యాచ్‌లో దంచి కొట్టిన తెలుగు వారియర్స్.. ఘ‌న విజ‌యం

మ‌రి కొద్ది రోజుల‌లో ఐపీఎల్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే అంత‌క‌ముందు సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కాగా, దీనికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు సినిమాల‌తో సంద‌డి చేసిన స్టార్స్ ఇప్పుడు గ్రౌండ్‌లో బ్యాట్‌, బంతితో ర‌చ్చ చేస్తూ ప్రేక్షకుల‌కి క‌నువిందు చేస్తున్నారు. ఇక వారిని ఎంక‌రేజ్ చేసేందుకు అందాల ముద్దుగుమ్మ‌లు సైతం గ్రౌండ్‌కి వ‌చ్చి తెగ సంద‌డి చేస్తున్నారు. సీసీఎల్ క్రికెట్ లీగ్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే ఈ లీగ్‌ తొలి అంచె పోటీలు షార్జాలో జరుగుతుండగా.. వచ్చే నెల 1 నుంచి 3 వరకు రెండో అంచె మ్యాచ్‌లకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఈ లీగ్‌లో టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు.

ఇప్పుడు సీసీఎల్ పదో సీజన్ జ‌రుగుతుండ‌గా, ఇందులో 8 సినీ పరిశ్రమల నుంచి 8 జట్లు పాల్గొంటున్నాయి. బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబయి హీరోస్, తెలుగు వారియర్స్, పంజాబ్ డీ షేర్స్, భోజ్‌పురి దబంగ్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తలపడుతున్నాయి. నిన్న షార్జా వేదిక‌గా తెలుగు వారియర్స్ భోజ్‌పురి ద‌బాంగ్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌గా ఈ మ్యాచ్‌లో తెలుగు వారియ‌ర్స్ మంచి విజ‌యం సాధించింది.చివ‌రి వ‌ర‌కు మ్యాచ్ చాలా ఉత్కంఠ‌గా సాగ‌గా, చివ‌రికి తెలుగు వారియ‌ర్స్ 8 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌డంతో అత‌నికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వ‌రించింది.

సిరీస్‌లో తొలి మ్యాచ్ తెలుగు వారియ‌ర్స్ గెలిచిన నేపథ్యంలో టీమ్ మేట్స్, చీర్ చేయ‌డానికి వ‌చ్చిన సెల‌బ్రిటీస్, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తెలుగు వారియ‌ర్స్ జ‌ట్టుకి అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా ఉండ‌గా, సునీల్ జోషి య‌జ‌మానిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సీసీఎల్ సీజన్స్ లో తెలుగు వారియర్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచి ట్రోఫీ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. గత ఏడాది సీజన్ లో కూడా తెలుగు హీరోలే విజేతలుగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ సారి కూడా ట్రోఫీ అందుకోవాల‌ని తెలుగు వారియ‌ర్స్ ఉవ్విళ్లూరుతున్నారు