మ‌ళ్లీ టైమ్డ్ ఔట్ చూసే వాళ్ల‌మే.. వోక్స్ తెలివితో జ‌స్ట్ మిస్

మ‌ళ్లీ టైమ్డ్ ఔట్ చూసే వాళ్ల‌మే.. వోక్స్ తెలివితో జ‌స్ట్ మిస్

ప్ర‌స్తుతం వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023 నాకౌట్ వైపు స‌మీపిస్తుంది. ఏయే జ‌ట్లు సెమీస్‌కి చేరుకుంటాయా అని క్రికెట్ అభిమానులు లెక్క‌లేసుకుంటున్నారు. ఇప్పటికే భార‌త్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కి చేరుకోగా నాలుగో స్థానంలో ఏ జ‌ట్టు వ‌స్తుంద‌నే దానిపై సందిగ్ధం నెల‌కొంది. ఇక ఒక‌వైపు ఈ చ‌ర్చ న‌డుస్తుండ‌గా, మ‌రోవైపు టైమ్డ్ అవుట్ అనే అంశం. బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచులో లంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిర‌గ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్ అయింది. వికెట్ పడిన తర్వాత రెండు నిమిషాల్లోగా తదుపరి బ్యాటర్ క్రీజులో రెడీగా ఉండాలని ఎంసీసీ రూల్ కాగా, ఆ మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన తర్వాత మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ తెగిపోవ‌డం చూసి మ‌రో హెల్మెట్ తెప్పించుకున్నాడు. అప్పుడు రెండు నిమిషాలు స‌మ‌యం దాటిపోవ‌డంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అండ్ టీం అప్పీల్ చేశారు. అంపైర్లు మాథ్యూస్‌ని అవుట్‌గా ప్రకటించారు. ఇది పెద్ద దుమారానికి తెరలేపింది.

దీనిపై భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో ఇలాంటి సీన్ ఇంగ్లండ్, నెద‌ర్లాండ్ మ్యాచ్‌లో కూడా జ‌రిగేదే. ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ క్రీజులోకి వచ్చినప్పుడు హెల్మెట్‌లో ఏదో లోపం ఉన్న‌ట్టు గ‌మ‌నించాడు. అయితే తనను కూడా టైం అవుట్ తో పెవీలియ‌న్‌కి పంపిస్తారేమోన‌ని భ‌య‌ప‌డి త‌న స‌మ‌స్యని అంపైర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి చెప్పాడు. వారి ప‌ర్మీష‌న్‌తో మ‌రో హెల్మెట్ తెప్పించుకొని గేమ్ ఆడాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే నెదర్లాండ్స్, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. ఏకంగా 160 పరుగుల తేడాతో ఈ మ్యాచులో విజయం సాధించింది. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

మొద‌ట్లోనే జానీ బెయిర్‌స్టో (15) ఔట‌య్యాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన జో రూట్ (28) కూడా తొంద‌రగానే పెవీలియ‌న్ చేరాడు. హ్యారీ బ్రూక్ (11), జోస్ బట్లర్ (5), మొయీన్ అలీ (4), డేవిడ్ విల్లే (6) ఇలా మెయిన్ బ్యాట్స్‌మెన్స్ వెంట‌వెంట‌నే పెవీలియ‌న్‌కి క్యూ క‌ట్టారు. అయితే డేవిడ్ మలాన్ (87) , బెన్ స్టోక్స్ (108) క‌లిసి అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఈ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ దారుణంగా తడబడ‌డంతో 37.2 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది.తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు (41 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ.. మిగతా బ్యాటర్లు వెస్లీ బారెసీ (37), సైబ్రాండ్ ఎండెల్‌బ్రెట్ (33), స్కాట్ ఎడ్వర్డ్స్ (38) భారీ స్కోర్స్ చేయ‌లేక‌పోయారు.