50 నిమిషాల్లో రెండు సార్లు గుండెపోటు.. కానీ ఆమె ప్రేమ బతికించింది..!
ఓ వ్యక్తికి 50 నిమిషాల్లో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ వచ్చేలోపు అతని ప్రియురాలు సీపీఆర్ చేసింది. బతకడు అనుకున్న వ్యక్తిని ప్రేమ బతికించింది.

ఓ వ్యక్తికి 50 నిమిషాల్లో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ వచ్చేలోపు అతని ప్రియురాలు సీపీఆర్ చేసింది. పారామెడికల్ సిబ్బంది 40 నిమిషాల్లో 11 సార్లు డిఫ్రిబ్రిలేటర్ చేశారు. ఆ తర్వాత అతనికి హార్ట్ బీట్ ప్రారంభమైంది. మళ్లీ గుండె ఆగిపోవడంతో 10 నిమిషాల్లో ఆరుసార్లు డిఫ్రిబ్రిలేటర్ చేశారు. మొత్తానికి అతను కోమాలోకి వెళ్లిపోయాడు. బతకడు అనుకున్న వ్యక్తిని ప్రేమ బతికించింది. తన ప్రేయసి పక్కనుండి.. అతనికి తన ప్రేమను పంచింది. ఐదు వారాల తర్వాత అతను కోమాలో నుంచి బయటకు వచ్చాడు. ఆ ఇరువురి మధ్య ఉన్న ప్రేమనే అతన్ని బతికించింది.
31 ఏండ్ల బెన్ విల్సన్.. కాబోయే భార్య రెబెక్కా హోల్మెస్(27)తో కలిసి ఉంటున్నాడు. అయితే గతేడాది జూన్ 11న విల్సన్‌కు గుండెపోటు వచ్చింది. 50 నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు గుండెపోటుకు గురయ్యాడు. అంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది అతనికి డిఫ్రిబ్రిలేటర్ చేసి హార్ట్ బీట్ వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్టెంట్స్ కూడా వేశారు. విల్సన్‌కు మెదడులో కూడా రక్తం గడ్డ కట్టడంతో మొత్తానికి అతను కోమాలోకి వెళ్లిపోయాడు. స్మోకింగ్, గేమింగ్, డ్రింకింగ్ చేయడంతో పాటు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే గుండెపోటు గురవడం, మెదడులో రక్తం గడ్డకట్టడం జరిగాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఏడో రోజు అతనికి మళ్లీ స్ట్రోక్స్ వచ్చాయి. ఇక అతను బతకడం కష్టమని డాక్టర్లు చేతులేత్తేశారు.
ఇలా చెడు వార్త విన్నప్పుడల్లా రెబెక్కా.. తన ప్రియుడి వద్దే అతనికి ముద్దులు పెడుతూ స్పర్శ కలిగించేది. తన ప్రేమను చాటేది. ఇక తమకు ఇష్టమైన డ్రీమ్ ఆ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మీ అనే సాంగ్‌ను రెబెక్కా పాడేది. ఫర్‌ప్యూమ్స్ కూడా అతని దిండుపై చల్లేది. తన కోసం తీసుకొచ్చిన టెడ్డీని కూడా బెడ్‌పై ఉంచింది. అలా అతన్ని బతికించుకునేందుకు రెబెక్కా తన ప్రేమను కురిపించేది. అతనిపై నాకున్న ప్రేమే అతడిని ప్రాణాలతో కాపాడింది అని నమ్ముతున్నాను. అతను ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతం అని రెబెక్కా పేర్కొన్నారు. విల్సన్ తనపై ఎంతో ప్రేమ కురిపించేవాడని, ఇప్పుడు ఒకరికొకరం తోడుగా ఉంటామని ఆమె ఆనంద భాష్పాలు రాల్చింది.
ఇప్పుడు విల్సన్ శరీరంలోని పలు అవయవాలు దెబ్బతిన్నాయి. కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. బ్రీతింగ్ ట్యూబ్ తప్పనిసరి అయింది. మొత్తానికి ఐదు వారాల తర్వాత అతను కోమాలో నుంచి బయటకు రావడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. లేచి నిలబడటం, మాట్లాడడం చేస్తున్నాడు. అతను స్పృహలోకి వచ్చిన తర్వాత తొలి మాట రెబెక్కా అని పిలిచాడు. రెబెక్కా అని పిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది అని ఆమె తెలిపారు. ఎనిమిదిన్నర నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత గత గురువారం విల్సన్, రెబెక్కా తమ ఇంటికి చేరుకున్నారు.
తన ప్రియురాలు రెబెక్కాతో పెళ్లి చేసుకునేందుకు విల్సన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆమె ప్రేమనే తనను బతికించిందని, ఆమె తనకు లోకమని విల్సన్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇది తనకు పునర్జన్మ అని, రెబెక్కాతో మళ్లీ తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని తెలిపాడు. తనకు వైద్యం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు విల్సన్.