వ‌రుణ్ గాంధీకి షాకిచ్చిన బీజేపీ.. ఫిలిబిత్ నుంచి యూపీ మంత్రి పోటీ..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత వ‌రుణ్ గాంధీకి ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వం షాకిచ్చింది. 111 మంది అభ్య‌ర్థుల‌తో విడుద‌లైన బీజేపీ ఐదో జాబితాలో వ‌రుణ్ గాంధీకి చోటు ద‌క్క‌లేదు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిలిబిత్ నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌రుణ్ గాంధీని బీజేపీ ప‌క్క‌న పెట్టింది.

వ‌రుణ్ గాంధీకి షాకిచ్చిన బీజేపీ.. ఫిలిబిత్ నుంచి యూపీ మంత్రి పోటీ..!

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత వ‌రుణ్ గాంధీకి ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వం షాకిచ్చింది. 111 మంది అభ్య‌ర్థుల‌తో విడుద‌లైన బీజేపీ ఐదో జాబితాలో వ‌రుణ్ గాంధీకి చోటు ద‌క్క‌లేదు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిలిబిత్ నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌రుణ్ గాంధీని బీజేపీ ప‌క్క‌న పెట్టింది. ఫిలిబిత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి యూపీ మంత్రి జితిన్ ప్ర‌సాద‌కు అవ‌కాశం ఇచ్చింది. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఫిలిబిత్ నుంచి ప్ర‌సాద పోటీ చేస్తున్న‌ట్లు తెలిపింది.

ఫిలిబిత్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుణ్ గాంధీ, ఆయ‌న త‌ల్లి మ‌నేకా గాంధీ.. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి రాజ‌కీయంగా స్థిర‌ప‌డ్డారు. వీరిద్ద‌రూ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ప‌లుసార్లు ఎన్నిక‌య్యారు. అనూహ్యంగా ఈ ఎన్నిక‌ల్లో వ‌రుణ్ గాంధీని కాద‌ని జితిన్ ప్ర‌సాద‌ను పోటీలోకి దింపారు. వ‌రుణ్ గాంధీ 2009 ఎన్నిక‌ల్లో ఫిలిబిత్ నుంచి 4.19 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ గెలుపొందారు. వ‌రుణ్ గాంధీ నిర్ణ‌యం ఏంట‌ని తెలియాల్సి ఉంది. మ‌నేకా గాంధీకి సుల్తాన్‌పూర్ ఎంపీ టికెట్ కేటాయించారు.

ఇక జితిన్ ప్ర‌సాద‌.. ప్ర‌స్తుతం యోగి కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్నారు. యూపీ శాస‌న మండ‌లిలో ఆయ‌న స‌భ్యుడు. మ‌న్మోహన్ సింగ్ కేబినెట్‌లో రెండు సార్లు మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు జితిన్ ప్ర‌సాద‌. 2014, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌సాద ఓడిపోయారు. 2017లో జ‌రిగిన యూపీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.