Viral Video | ట్రాక్‌పై రాళ్లు, రాడ్లు.. ఎమ‌ర్జెన్సీ బ్రేక్‌లు వేసిన వందేభార‌త్ లోకో పైల‌ట్లు

Viral Video | ట్రాక్‌పై రాళ్లు, రాడ్లు.. ఎమ‌ర్జెన్సీ బ్రేక్‌లు వేసిన వందేభార‌త్ లోకో పైల‌ట్లు

Viral Video | దేశంలో ప‌లు చోట్ల వందే భార‌త్ రైళ్ల‌ను టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో వందే భార‌త్ రైళ్ల‌పై దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ వందే భార‌త్ రైలును ల‌క్ష్యంగా చేసుకుని, ఆ రైలు వ‌స్తున్న ట్రాక్‌పై రాళ్లు, రాడ్లు ఉంచారు. లోకో పైల‌ట్ల అప్ర‌మ‌త్త‌తతో వేలాది మంది ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఎమ‌ర్జెన్సీ బ్రేక్‌లు వేసి ప్ర‌మాదం నుంచి త‌ప్పించారు లోకో పైల‌ట్లు.

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ నుంచి జైపూర్‌కు సోమ‌వారం ఉద‌యం 7:50 గంట‌ల‌కు వందే భార‌త్ రైలు బ‌య‌ల్దేరింది. ఉద‌యం 9:55 గంట‌ల స‌మ‌యంలో రైలు భిల్వాడా స్టేష‌న్ స‌మీపానికి రాగానే.. ప‌ట్టాల‌పై రాళ్లు, ఇనుప‌రాడ్ల‌ను లోకో పైల‌ట్లు గుర్తించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన లోకో పైల‌ట్లు ఎమ‌ర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పి, వేలాది మంది ప్ర‌యాణికుల‌ను ప్రాణాల‌తో కాపాడారు.

ఘట‌నాస్థ‌లానికి చేరుకున్న రైల్వే పోలీసులు, స్థానికులు రాళ్ల‌ను, రాడ్ల‌ను తొల‌గించారు. రాళ్లు ప‌క్క‌కు క‌ద‌ల‌కుండా ఉండేందుకు, స‌పోర్ట్‌గా రాడ్ల‌ను ఉంచారు. వీటిని చూసి ప్ర‌యాణికులు, అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా ఆక‌తాయిలు చేసిన ప‌నా? లేక కుట్ర‌కోణం ఉందా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.