Koppula Eshwar | కొనసాగుతోన్న ‘కొప్పుల’ జైత్రయాత్ర..! ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచేనా..?

Koppula Eshwar | కొప్పుల ఈశ్వర్.. సౌమ్యుడు. ఒక అణగారిన కులంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ అమాత్యుడిగా ఆసీనులయ్యారు. రాజకీయ కుట్రలు తెలియని ఆయన ప్రజల మనిషిగా ముద్ర వేసుకున్నారు. 26 ఏండ్లు సింగరేణి కార్మికుడిగా పని చేసిన కొప్పుల ఈశ్వర్.. 22 ఏండ్ల కిందట కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో, తెలంగాణ ఉద్యమంలో ఎత్తులు పల్లాలు చూశారు. గెలిచినా, ఓడినా కేసీఆర్‌కు ఒక తమ్ముడిలా, నిబద్ధత కలిగిన సైనికుడిలా బీఆర్ఎస్‌కు వెన్నంటి ఉన్నారు. ఇక తన రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఓటమిని చవి చూసిన ఈశ్వర్.. ఆ తర్వాత నుంచి జైత్రయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కొప్పుల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఏడోసారి ధర్మపురి నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే వరుసగా ఐదుసార్లు ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన ఏ లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున ఎస్ కుమార్ బరిలో ఉన్నారు.
కొప్పుల రాజకీయ జీవితం..
1976లో సింగరేణిలో కోల్‌కట్టర్‌గా ఈశ్వర్ చేరారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే రాజకీయాల వైపు మళ్లారు. 1983లో టీడీపీలో చేరారు. మిడ్‌క్యాప్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1994లో మొదటిసారి మేడారం రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మాలేం మల్లేశం చేతిలో ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2001లో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2004 ఎన్నికల్లో మేడారం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీటీపీ అభ్యర్థి మాల మల్లేశంపై 56,563 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2008 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం నిర్వహించిన ఉపఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కుమారస్వామిపై 28,137 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం కొత్తగా ఏర్పడి ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో అప్పటి నుంచి ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010(ఉపఎన్నిక), 2014, 2018లో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 2018లో బీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు.