Maharashtra | పెండింగ్‌లో విద్యుత్ కనెక్షన్.. సచివాలయం ఎదుట మహిళ నగ్నంగా నిరసన

Maharashtra | తన ఇంటికి గత ఆరేండ్ల నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని నిరసిస్తూ.. మహారాష్ట్ర సచివాలయం ఎదుట ఓ మహిళ దుస్తులు విప్పి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన గాంధీ జయంతి రోజున చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నవీ ముంబైకి చెందిన ఓ మహిళ సోమవారం ఉదయం మహారాష్ట్ర సచివాలయం వద్దకు చేరుకుంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన ఇంటికి విద్యుత్ సరఫరా లేదని చెబుతూ సదరు మహిళ దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిని కలిసే వరకు తన పోరాటం కొనసాగుతోందని, అలా జరగని పక్షంలో సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. సమాచారం అందుకున్న పోలీసులు సచివాలయం వద్దకు చేరుకుని మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
తన ఇంటికి విద్యుత్ సరఫరా ఇచ్చే అంశం గత ఆరేండ్ల నుంచి పెండింగ్‌లో ఉందని మహిళ తెలిపింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్న విద్యుత్ అధికారి మానసికంగా హింసిస్తున్నాడని పోలీసులకు చెప్పింది. ఆస్తిని కూడా తన పేర రాయాలని ఆ అధికారి బలవంతం చేస్తున్నట్లు మహిళ ఆరోపించింది. తన కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని డిమాండ్ చేసింది. దళితులు, ముస్లింపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆమె ఓ బ్యానర్‌ను ప్రదర్శించింది. విద్యుత్ కనెక్షన్ విషయంలో 2017లో మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ కంపెనీ ఆఫీసు ఎదుట ఆమె నిరసన వ్యక్తం చేసింది. అప్పట్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.