గృహిణి కష్టం విలువ కట్టలేనిది.. అమె సేవలు అత్యున్నతమైనవి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గృహిణి చేసే పని అమూల్యమైనదని, ఇంటిని చక్కదిద్దుకోవడం అనేది అత్యున్నతమైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

న్యూఢిల్లీ : గృహిణి చేసే పని అమూల్యమైనదని, ఇంటిని చక్కదిద్దుకోవడం అనేది అత్యున్నతమైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె చేసే సేవలకు డబ్బు రూపేణా వెల కట్టలేమని పేర్కొన్నది. ఒక రోడ్డు ప్రమాదం కేసును శుక్రవారం విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం.. ఆమెకు నష్టపరిహారం కింద ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ‘కుటుంబంలో ఆదాయం సంపాదించే వారు ఎంత ముఖ్యమో.. గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యం. గృహణి చేసే పనులు లెక్కబెడితే.. ఆమె సేవలు అత్యున్నతమైనవని అర్థమవుతుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసలు ఆమె సేవలను డబ్బు రూపంలో లెక్కించలేమని స్పష్టం చేసింది. 2006లో రోడ్డు ప్రమాదంలో ఒక గృహిణి చనిపోయిన కేసులో తీర్పు చెప్పిన ధర్మాసనం.. ఆమెకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఆమె మరణానికి కారణమైన వాహనం బీమా చేయించి ఉండనందున ఆ వాహనం యజమానికి ఆమె కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని పేర్కొన్నది.
ఈ కేసులో ఆమె భర్త, మైనర్ అయిన కొడుకుకు 2.5 లక్షల పరిహారం ఇవ్వాలని మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే.. తమకు అధిక పరిహారం కావాలని వారు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ.. హైకోర్టు.. మృతురాలు గృహిణి అయినందున నష్టపరిహారాన్ని ఆమె ఆయుర్దాయం, కనీస ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుందని పేర్కొంటూ.. వారి పిటిషన్‌ను 2017లో కొట్టివేసింది. దీనిపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పరిశీలనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
‘రోజువారీ కూలీ ఆదాయం కంటే గృహిణి ఆదాయాన్ని తక్కువగా ఎలా పరిగణిస్తారు? ఈ ధోరణిని మేం అంగీకరించేది లేదు’ అని కోర్టు పేర్కొన్నది. నష్టపరిహారాన్ని ఆరు లక్షల రూపాయలకు పెంచింది. దానిని మృతురాలి కుటుంబానికి ఆరు వారాల్లో చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక గృహిణి విలువను ఎవరూ తక్కువ అంచనా వేయరాదని పేర్కొన్నది.