సురక్షితంగానే.. భయంభయంగా.. సొరంగంలోనే 90 గంటలుగా!..

ఉత్తర కాశీలోని ఒక సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు 90 గంటలు గడిచినా ఇంకా బయటకు రాలేదు.

సురక్షితంగానే.. భయంభయంగా.. సొరంగంలోనే 90 గంటలుగా!..
  • బయటకు రాని 40 మంది బాధితులు
  • పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్‌ సరఫరా

ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్నవారి పరిస్థితి రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతున్నది. కార్మికులు చిక్కుకున్న చోట వారి ఎదురుగా 50 మీటర్లకు పైగా శిథిలాలు కుప్పగా ఉన్నాయి. సొరంగం లోపలి భాగం చాలా బలహీనంగా ఉండడంతో సహాయ బృందాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మికులను సొరంగం నుండి రక్షించడానికి ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం ముమ్మరం చేస్తుండగా అవి మళ్లీ తిరిగి సొరంగంలోకి పడిపోతున్నాయి.


ఈ శిథిలాల మధ్య నుంచి స్టీల్ పైపులు చొప్పించి, కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పైపుల ద్వారా ఆక్సిజన్, నీరు, ఆహారం పంపుతున్నారు. రక్షించడానికి థాయిలాండ్, నార్వే నుండి నిపుణుల బృందాల సహాయం కూడా తీసుకుంటున్నారు. పైపుల ద్వారానే కార్మికులతో సంభాషణలు కూడా జరుగుతున్నాయి. కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితంగా బయటకు తీస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. యూపీ ప్రభుత్వం నోడల్ అధికారిని కూడా పంపింది.


యూపీలోని మూడు జిల్లాలకు చెందిన 8 మంది కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకు పోయారు. హెర్క్యులెస్‌ విమానం ద్వారా ఢిల్లీ నుంచి తెప్పించిన ఆగర్ మిషన్ సొరంగం వైపు వెళ్ళింది. సొరంగం దూరం 35 కిలోమీటర్లు యంత్రం బరువు కారణంగా ట్రక్కు నెమ్మదిగా కదులుతున్నది. 24 టన్నుల ఈ యంత్రం తన సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేస్తే గంటకు ఐదు మీటర్ల వేగంతో సొరంగాన్ని కోయగలుగుతుంది. నవంబర్ 12వ తేదీ ఉదయం ఉత్తర కాశీలో చార్ ధామ్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న సొరంగంలో కొంత భాగం గుంతలు పడింది. అక్కడ పనిచేస్తున్నవారు ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం 40 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారు.