మోదీ పాటను ఓడించిన జాకీర్‌హుస్సేన్ పాట
శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ సమ్మిళత బ్యాండ్ ‘శక్తి’ గ్రామీ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బం అవార్డును ఎగరేసుకుపోయింది

లాస్ ఏంజలీస్ : శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ సమ్మిళత బ్యాండ్ ‘శక్తి’ గ్రామీ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బం అవార్డును ఎగరేసుకుపోయింది. ఈ పోటీలో ప్రధాని నరేంద్రమోదీ సహ రచయితగా ఉన్న అబాండున్స్ ఇన్ మిల్లెట్స్ పాట కూడా నిలిచినా.. జాకీర్ హుస్సేన్ పాట బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ గ్రామీ అవార్డును కైవసం చేసుకుంది. శంకర్ మహదేవన్, ఇతర శక్తి బ్యాండ్ కళాకారులతో కలిసి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బంగా దిస్ మూమెంట్ నిలిచింది. ఈ బ్యాండ్‌లో ప్రఖ్యాత గిటారిస్ట్ జాన్ మెక్‌లాజ్లిన్, పర్క్యూషనిస్ట్ వీ సెల్వగణేశ్, వయోలెనిస్ట్ గణేశ్ రాజగోపాలన్ కూడా ఉన్నారు. ఈ అవార్డు దక్కడంపై శంకర్ మహదేవన్ సంతోషం వ్యక్తం చేశారు. తన బృందానికి, దేవుడికి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, యావత్ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. తన సంగీతంలో అణువణువు అయిన తన భార్యకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నానని చెప్పారు. 66వ వార్షిక గ్రామీ అవార్డులు-2024.. లాజ్ ఏంజలీస్‌లో ప్రకటించారు.
జాకీర్ హుస్సేన్‌కు పాష్తో పాటకు గాను బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ గ్రామీ అవార్డు దక్కింది. బేలా ఫ్లేక్, ఎడ్గార్ మియెర్, రాకేశ్ చౌరాశియాలతో కలిసి దీనిని చేశారు. ఒక దశలో ప్రధాని నరేంద్రమోదీ, ఫాలు, గౌరవ్ పాట నుంచి పోటీని ఎదుర్కొన్నా.. చివరకు పాష్తోనే నిలిచింది. దిస్ మూమెంట్ ఆల్బంలో మొత్తం 8 పాటలు ఉన్నాయి. మూడు గ్రామీ అవార్డులు గెలుచుకోవడం ద్వారా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ చరిత్ర సృష్టించారని ఇండియన్ కంపోజర్ రికీ కేజ్ ఎక్స్‌లో ప్రశంసించారు.