Warangal Murder Case: ప్రియుడితో కలిసి భార్య ప్లాన్.. భర్త డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి

విధాత: ఇటీవల వరంగల్‌లో యువ వైద్యుడు సుమంత్ రెడ్డిపై హాత్యాయత్నం కేసు పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుమంత్‌ను హత్య చేసేందుకు ప్రియుడు సామ్యూల్‌తో కలిసి స్వయానా సుమంత్ భార్య ఫ్లోరానే ప్లాన్ వేసి మరి ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సాయంతో ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై సామ్యూల్ దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుమంత్ రెడ్డి ఎంజీఎంలో 8 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ అర్థరాత్రి 12.51 గంటలు మృతి చెందాడు. నేడు ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను వరంగల్ (Warangal) పోలీసులు గురువారం పట్టుకుని మీడియా ఎదుట ప్రవేశ పెట్టిన సంగతి విధితమే.
వివరాల్లోకి వెళితే..
వరంగల్‌కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డికి 2014, 2015 సంవత్సరాల మధ్య ఫ్లోరా పరిచయమైంది. ఈ ప్రేమను కాస్తా 2016లో పెళ్లిగా మార్చుకున్నారు. కొంత కాలం తర్వాత 2018లో సుమంత్ రెడ్డి, ఫ్లారో దంపతులు ఉపాధి కోసం సంగారెడ్డికి మకాం మార్చారు. సుమంత్ రెడ్డి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేయగా, ఫ్లోరా ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తుండేది. సంగారెడ్డికి మారిన కొన్ని రోజుల తర్వాత ఫోరా ఫిట్నెస్ కోసం సిద్దు జిమ్ సెంటర్లో చేరింది. అక్కడే కథ మలుపు తిరిగింది. అక్కడ కోచ్‌గా పని చేస్తున్న ఎర్రోల్ల శామ్యూల్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం డాక్టర్‌కు తెలియడంతో భార్యా భర్తల ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు సైతం జరిగాయి. ఈ క్రమంలో సంగారెడ్డి నుంచి వరంగల్‌కి షిఫ్ట్ అయ్యారు. అనంతరం 2019లో జనగామ జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఫ్లోరా లెక్చరర్‌గా ఉద్యోగం దొరకడంతో అక్కడికే నివాసం మార్చారు. అయితే ఇటీవల కాలేజీ వరంగల్ రంగశాయిపేటకు మారడంతో తిరిగి ఇక్కడికి వచ్చి వాసవి కాలనీలో ఉంటున్నారు. డాక్టర్ సుమంత్ రెడ్డి కాజీపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తుండే వాడు.
షిఫ్ట్ అయినా తీరు మారలేదు
ఇదిలా ఉండగా ఫ్లోరా మాత్రం తన పద్ధతి మార్చుకోకుండా శామ్యూల్‌తో వ్యవహారం నడిపించింది. తరచు ఫోన్లు మాట్లాడడం, వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం తెలిసి మరోమారు భార్యభర్తల మధ్య గొడవలు పెరిగాయి. దీంతో ఫ్లోరా తన ప్రియుడు శామ్యూల్ కలిసి భర్త సుమంత్ రెడ్డిని చంపేందుకు పథకం పన్నింది. ఇందు కోసం శామ్యూల్ తన స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సాయం తీసుకున్నాడు. హత్యకి సహకరిస్తే ఇంటిని నిర్మించి ఇస్తానని ఆశ చూపడంతో రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు. రూ. లక్షను ఫ్లోరా , శామ్యూల్‌కి ట్రాన్స్ఫర్ చెయ్యగా అందులో నుంచి రూ. 50 వేలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన రూ.50 వేలను రాజ్ కుమార్‌కి ఇచ్చాడు.
దారి కాచి హత్యాయత్నం
ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీన సంగారెడ్డిలో రాజ్ కుమార్, శామ్యూల్ సుత్తె కొని మోటార్ సైకిల్‌పై కాజీపేటకు వచ్చి సుమంత్ రెడ్డి హత్యకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించి బట్టుపల్లి రోడ్డును అనువైందిగా నిర్ణయించుకున్నారు. ఆపై డాక్టర్ సుమంత్ రెడ్డి తన క్లినిక్ నుంచి కారులో బయలుదేరగా ఆయనను అనుసరించి బట్టుపల్లి శివారులో అడ్డుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి సుమంత్ రెడ్డిపై ఇష్టానుసారం తీవ్రంగా దాడి చేశారు. అయితే రక్తస్రావం ఎక్కువగా జరుగడంతో సుమంత్ చనిపోయాడనుకొని భావించి అక్కడి నుంచి నిందితులు ఇద్దరు పారిపోయారు. ఆపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సుమంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరంగల్ ఏసీపీ నంది రామ్ ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ వెంకట్రత్నం ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.