ఇటీవ‌లి కాలంలో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎక్కువ ఆస‌క్తి చూబుతున్నారు. కొందరు తాము న‌టించిన సినిమాల‌లో స్టార్స్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుండ‌గా, మ‌రి కొంద‌రు తెలిసిన వారిని వివాహ‌మాడుతున్నారు. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో వాలంటైన్స్ డే వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌న టాలీవుడ్‌లో ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న జంట‌లెవ‌రో ఓ సారి చూద్దాం. ముందుగా చూస్తే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త గురించి చెప్పుకోవాలి. 2005 ఫిబ్రవరి 10న వీరి వివాహం జరగడం విశేషం. వీరికి కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. పెళ్లై 19 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌టికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఇక పుష్ప‌తో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లి అప్ప‌ట్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ జంట‌కి అయాన్,అర్హ అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. బ‌న్నీ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతుంటారు. వీరి ఫ్యామిలీని చూసి చాలా మంది తెగ ముచ్చ‌ట‌ప‌డిపోతుంటారు. బ‌న్నీ కూతురు అర్హ శాకుంత‌లం చిత్రంతో వెండితెర డెబ్యూ ఇవ్వ‌గా, భార్య స్నేహా రెడ్డి కూడా త్వ‌ర‌లో వెండితెర‌పై సంద‌డి చేయ‌నుంద‌ని టాక్ వినిపిస్తుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కామినేని 2012లో కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన ప‌దేళ్ల‌కి వీరు పాప‌కి జ‌న్మనిచ్చారు. గతేడాది కూతురు జన్మించగా ఆ పాప‌కి క్లింకార అని నామ‌క‌ర‌ణం చేశారు.

ఇక నేచురల్ స్టార్ నాని - అంజనా యెలవర్తిల‌ది కూడా ల‌వ్ మ్యారేజ్. వారికి బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ఉంది. వీరిద్దరూ 2012లో ప్రేమ వివాహం చేసుకొని ఒక్క‌ట‌య్యారు. వారు చిన్ననాటి స్నేహితులు కాగా, ఆ స్నేహం ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఈ జంట‌కి జున్ను అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇక యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ - పల్లవి వర్మ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020లో వీరి మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఆరేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి గతేడాది నవంబర్ 3న ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికీ నెట్టింట సంద‌డి చేస్తూనే ఉంటాయి. మెగా ఫ్యామిలీ అంతా వీరి పెళ్లికి హాజ‌రై సంద‌డి చేసింది.

Updated On 12 Feb 2024 2:50 PM GMT
sn

sn

Next Story