అన్నంపెట్టే బ్యాంకుకే కన్నం పెట్టారు
తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్లు అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేసిన ఇంటి దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని చెన్నూరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో తాము పనిచేస్తున్న బ్యాంకుకే కన్నంవేసిన కేసిన 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు

- 44 మంది నిందితుల అరెస్టు
- 15 కిలోల బంగారం, నగదు స్వాధీనం
- ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల కీలక పాత్ర
- స్వల్పకాలంలో కేసును చేధించిన పోలీసులు
విధాత ప్రత్యేక ప్రతినిధి: తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్లు అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేసిన ఇంటి దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని చెన్నూరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో తాము పనిచేస్తున్న బ్యాంకుకే కన్నంవేసిన కేసిన 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ 44 మందిలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులతో పాటు ఈ అక్రమంలో పాలుపంచుకున్నవారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు నుంచి మాయం చేసిన బంగారు నగలు, నగదును రికవరీ చేశారు. ఈ నెల 23వ తేదీన ఈ అక్రమాలకు సంబంధించి ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసును అతి తక్కువ కాలంలో పోలీసులు చేధించారు.
44 మంది నిందితుల అరెస్టు – 15 కిలోల బంగారంస్వాధీనం
ఈ సంఘటనలో బ్యాంకుకు చెందిన ముగ్గురు ప్రధాన నిందితులు చెన్నూరు బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్, బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ అటెండర్ లక్కాకుల సందీప్ లతో పాటు ఈ భాగోతంలో భాగస్వామ్యమైన మరో 41 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. రూ.1,61,730 నగదును రికవరీ చేశారు.
భారీ చోరీ వివరాలిలా ఉన్నాయి
ఎస్బీఐ చెన్నూర్ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రీజినల్ మేనేజర్ తన ఫిర్యాదులో బ్యాంకులో 402 గోల్డ్ లోన్ ఖాతాలకు సంబంధించి 25.17 కిలోల బంగారు అభరణాలు వీటి విలువ రూ.12.61 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు రూ.1.10 కోట్లు నగదు దుర్వినియోగంతో పాటు చోరీకి గురైందని పేర్కొన్నారు. దీనిపై రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ భాస్కర్, మంచిర్యాల డీసీపీ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జైపూర్ ఏసీపీకి దర్యాప్తు బాధ్యతను వెంకటేశ్వర్ కు అప్పగించారు. ఆయన ఈ కేసును రికార్డు స్థాయిలో పరిష్కరించారు. బ్యాంకు క్యాషియర్ ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. దీన్ని పూడ్చుకోవడం కోసం బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్ కరెన్సీ ఛెస్ట్ యొక్క తాళం మేనేజర్, క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉండేది. మేనేజర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చినాడు. దీని ద్వారా బంగారం, నగదు దొంగిలించేందుకు పథకం రచించాడు. అక్టోబర్ 2024 నుండి తరచూ గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి, తన స్నేహితుల ద్వారా ఇతర బ్యాంకుల్లో, ప్రైవేటు ఫైనాన్స్లలో తాకట్టుపెట్టి ఈ డబ్బును తమ అనుకూల మైన వారి ఖాతాల్లోకి మల్లించారు. ఈ కేసును తక్కువ కాలంలో చాకచక్యంగా ఛేదించినందుకు డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు దేవేందర్ రావు బన్సీలాల్, వేను చందర్, రాకేష్, కె.నరేష్ కుమార్, బాబురావు, సుబ్బారావులను సీపీ అభినందించారు.