లండన్ ప్రైడ్ విస్కీ తయారీదారులకు సుప్రీం కీలక ఆదేశాలు
బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ విస్కీ తయారీదారులు దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు సోమవారం మధ్యప్రదేశ్‌కు చెందిన విస్కీ తయారీ, అమ్మకందారుకు నోటీసులు జారీ

ప్యాకేజీ మార్చుకుంటారా? లేదా?
న్యూఢిల్లీ : బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ విస్కీ తయారీదారులు దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు సోమవారం మధ్యప్రదేశ్‌కు చెందిన విస్కీ తయారీ, అమ్మకందారుకు నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థ ‘లండన్ ప్రైడ్’ ట్రేడ్ మార్క్ కింద విస్కీ తయారు చేసి అమ్ముతున్నది. అయితే.. లండన్ ప్రైడ్ బాటిల్, ప్యాకేజింగ్ తమను పోలి ఉన్నాయంటూ బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ ట్రేడ్ మార్క్ విస్కీ తయారీదారులు ఆరోపిస్తూ కోర్టుకెక్కారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ప్యాకేజింగ్, బాటిల్ రంగు మార్చేందుకు కంపెనీ అనుకూలమేనా? అన్నది తెలుసుకోగోరుతున్నామని కంపెనీ తరఫు న్యాయవాదికి తెలిపింది. తదుపరి విచారణ తేదీ నాటికి తమకు కంపెనీ ప్రతిస్పందనను తెలియజేయాలని న్యాయవాది ఎస్ మురళీధర్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మీరు (లండన్ ప్రైడ్) ఎందుకని ఒకే తరహా ట్రేడ్ డ్రస్, రంగుతో తీసుకొచ్చారు? బాటిల్ ప్యాకేజీ, రంగు మార్చుతారా? అనే విషయంలో సూచనలు తీసుకోవాలని కోరింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. తదుపరి విచారణలో పేర్లపై ట్రేడ్‌మార్క్ వివాదం గురించి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.
ఈ బ్రాండ్ల యుద్ధం సందర్భంగా జనవరి 5న జరిగిన విచారణలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎదుటకు విస్కీ బాటిళ్లు రావడం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ హైకోర్టు నవంబర్‌లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ విస్కీ తయారీ, అమ్మకందారు అయిన పెర్నాడ్ రిచర్డ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందంటూ లండన్ ప్రైడ్ కంపెనీపై దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ఇన్‌జంక్షన్ ఆర్డర్ ఇచ్చేందుకు ఇండోర్ కమర్షియల్ కోర్టు తిరస్కరించడంతో పెర్నాడ్ రిచర్డ్ కంపెనీ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది.