కన్న బిడ్డలను కిడ్నాప్ చేసిన తండ్రి

జల్సాల కోసం అలవాటుపడిన ఓ తండ్రి కన్న బిడ్డలనే కిడ్నాప్ చేసి విక్రయానికి పెట్టాడు.

కన్న బిడ్డలను కిడ్నాప్ చేసిన తండ్రి

♦ జడ్చర్ల పట్టణంలో కలకలం

♦ జల్సాలకు అలవాటుపడి

♦ తన పిల్లలనే విక్రయానికి పెట్టిన తండ్రి

♦ రూ.9 లక్షలకు కుదిరిన బేరం

♦ సకాలంలో స్పందించిన పోలీసులు

♦ హైదరాబాద్ లో పట్టుబడిన నిందితుడు

జల్సాల కోసం అలవాటుపడిన ఓ తండ్రి కన్న బిడ్డలనే కిడ్నాప్ చేసి విక్రయానికి పెట్టాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలివి. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీ ప్రాంతంలో నివాసం ఉండే రఫీ చెడు వ్యాసనాలకు బానిసై, అప్పులపాలయ్యాడు. అప్పులు చేసి గోవాతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి జల్సా చేసేవాడు. ఇలా కొన్నిరోజుల నుంచి జల్సాలకు డబ్బు లేకపోవడం.. అప్పు ఎవరూ ఇవ్వకపోవడటంతో అక్రమంగా సంపాదించాలకున్నాడు.


తన ముగ్గురు పిల్లలు సాబీనాబేగం (5), రమీజ్ (3), ఏడాదిన్నర బాలుడు సైఫుద్దీన్ ని విక్రయిస్తే డబ్బులు భారీగా వస్తాయని అనుకున్నాడు. ఆదివారం పథకం అమలుసేందుకు ముగ్గురు పిల్లలకు మాయమాటలు చెప్పి బైక్ పై కూర్చోబెట్టుకున్నాడు. హైదరాబాద్ లోని యాకుత్ పుర ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తన భార్యకు ఫోన్ చేసి పిల్లలను విక్రయిస్తున్నట్లు తెలిపాడు. వెంటనే స్పందించిన ఆమె జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించింది. ఈ సంఘటనపై పోలీసులు స్పందించి, రఫీ ఫోన్ ను ట్యాప్ చేశారు.


హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి యాకుత్ పుర లో ఉన్న రఫీ ని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పిల్లలను అక్కడే కారులో బంధించిన విషయం తెలుసుకున్న పోలీసులు వారిని విడిపించి తల్లికి అప్పగించారు. అప్పటికే ముగ్గురు పిల్లలను రూ.9 లక్షలకు బేరం కుదురించుకున్న రఫీ, అడ్వాన్స్ కోసం వేచిచూస్తున్న సమయంలో పోలీసులకు దొరికిపోయాడు. సోమవారం నిందితున్ని జడ్చర్లకు తీసుకొచ్చిన తరుణంలో బంధువులు, కాలనీ వాసులు దేహశుద్ధి చేశారు. ఘటనపై జడ్చర్ల సీఐ రమేష్ వెంటనే స్పందించి, ముగ్గురు పిల్లలను కాపాడడంతో స్థానికులు అభినందిస్తున్నారు.