నిందార్హమైన హత్యగా రుజువు చేస్తాం : పుణె పోలీస్​

పుణెలో ఈనెల 19న తన తండ్రికి చెందిన విలాసవంతమైన పోర్షే కారు నడుపుతూ 17ఏళ్ల అబ్బాయి ఇద్దరు టెకీల దుర్మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మైనర్ చేసింది నిందార్హమైన హత్యగా రుజువు చేయగలమని పుణె పోలీస్ కమీషనర్ తెలిపారు.

నిందార్హమైన హత్యగా రుజువు చేస్తాం : పుణె పోలీస్​

12వ తరగతి పరీక్షలలతో తమ విజయాన్ని పురస్కరించుకుని, ఓ పబ్​లో తన స్నేహితులతో కలసి మద్యం సేవించిన ఓ 17 యేళ్ల టీనేజర్​, అర్థరాత్రి 2.15 గంటలకు తన తండ్రి పోర్షే(Porsche Car) కారుతో విపరీతమైన వేగం(200 Kmph)తో నడుపుతూ, కళ్యాణీనగర్​ ప్రాంతంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బైక్​ను ఢీకొట్టి, వారి మరణానికి కారణమయ్యాడు. చనిపోయిన వారిని అనీశ్​ అవధియా(Anish Awadhia)(24), అశ్వినీ కోస్తా(Ashwini Costa)(25)గా గుర్తించారు.

ఈ నేరానికి శిక్షగా టీనేజర్​కు జువైనల్​ జస్టిస్​ బోర్డ్​ (Juvenile Justice Board) కొన్ని షరతులపై బెయిల్​ మంజూరు  చేసింది. జువైనల్​ బోర్డు విధించిన షరతులేంటంటే, ప్రమాదం గురించి 300 పదాలకు మించకుండా ఒక వ్యాసం(Essay with 300 words) రాయడం, ఎరవాడ ట్రాఫిక్​ పోలీసులతో కలిసి 15 రోజులు పనిచేయడం, మద్యపానం మానేసేందుకు డాక్టర్​ వద్ద ట్రీట్​మెంట్​ తీసుకోవడం, మానసిక వైద్యుల వద్ద కౌన్సెలింగ్​ తీసుకోవడం…..ఆ సంఘటన, ఈ తీర్పుతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదేం చోద్యమంటూ ముక్కునవేలేసుకునేట్లుందని నెటిజన్లు జువైనల్​ బోర్డుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పుణె పోలీసులు, అబ్బాయి తండ్రిని అరెస్ట్​ చేసి, తనకు మద్యం సరఫరా చేసిన పబ్​(Cosie Pub)ను సీల్​ చేసారు. మహరాష్ట్రలో మద్యం సేవించే కనిష్ట వయసు 25 సంవత్సరాలు. పిల్లాడి తండ్రి పుణేలో బాగా పేరున్న రియల్​ ఎస్టేట్​ వ్యాపారి, బాగా పలుకుబడి ఉన్న అత్యంత సంపన్నుడు.

ఈ విషయమై పుణె పోలీస్​ కమీషనర్​ అమితేశ్​ కుమార్​(Amitesh Kumar) మాట్లాడుతూ, ఆ అబ్బాయి నిందాపూర్వక హత్య (Culpable Homicide) చేసినట్లుగా తాము రుజువు చేసి తీరతామని స్పష్టం చేసారు. ఆ టీనేజర్​కు తన ర్యాష్​ డ్రయివింగ్​ పర్యవసానాలేంటో బాగా తెలుసని, యాక్సిడెంట్​ జరిగితే బాధితులు మరణించే అవకాశముందన్న విచక్షణ  కూడా ఉందని తాము రుజువు చేయగలమని కమీషనర్​ తెలిపారు. ఆ ప్రకారమే భారత శిక్షా స్మృతి సెక్షన్లను తనపై మోపుతామని ఆయన స్పష్టం చేసారు. ప్రస్తుతానికి తనతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులను సాక్ష్యాలుగా పరిగణిస్తున్నట్లు, కేసును అత్యంత పటిష్టంగా నిర్మిస్తున్నట్లు ఆయన అన్నారు. నేర తీవ్రత దృష్ట్యా తాము జువైనల్​ బోర్డుని సంప్రదించినప్పటికీ తమ విజ్ఞప్తిని బోర్డు తిరస్కరించిందని, అందుకే తాము జిల్లా కోర్టును ఆశ్రయించామని తెలిపారు. నిర్భయ చట్టం ప్రకారం, నిందితులు 16 ఏళ్లవారైనా చేసిన నేరం ఘోరమైనదైతే  మేజర్​గానే పరిగణించవచ్చని కమీషనర్​ అన్నారు. ఆ అబ్బాయికి వ్యతిరేకంగా తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలున్నాయని, అన్ని సీసీటీవీ ఫుటేజ్​లలో ఆ అబ్బాయి, అతని ఫ్రెండ్స్​ ఉన్నారని కుమార్​ తెలిపారు.

మరోవైపు, మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ జువైనల్​ బోర్డు తీర్పుపై విస్మయం వ్యక్తం చేసారు. ఇదేం శిక్షని, బోర్డు విధించిన తేలికపాటి శిక్షను ఖండించారు. ఈ కేసులో నిందితులను కఠినాతికఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. జువైనల్​ బోర్డు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తాము జిల్లా కోర్టులో అప్పీల్​ చేసామని, ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తనకు తెలుసన్నారు. కేసు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటునట్లు ఫడ్నవీస్​ తెలిపారు.

ఈ సంఘటనను హత్యగానే చూడాలని, జువెనైల్​ బోర్డు ఇచ్చిన విచిత్రమైన తీర్పు తమను షాక్​కు గురిచేసిందని మరణించిన పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక పుణేలో ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. యాక్సిడెంట్​ చేసిన కారున్న పోలీస్​స్టేషన్​కు వెళ్లి, దాన్ని ఎడాపెడా కర్రలతో, రాళ్లతో బాదారు. పుణే నెటిజన్లు పనిలో పనిగా అసలు ఈ తీర్పు ఇచ్చిన జువైనల్​ బోర్డు జడ్డి ఎవరా అని ఆరా తీస్తున్నారు.