రాముడి పేరుతో ఓట్లు దండుకునే యత్నం
పురాతన ఆలయాలను పునరుద్ధరించే పేరుతో వాటిని బిజినెస్ మాల్స్‌గా మార్చివేస్తున్నారని వారణాసి విశ్వనాథ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను గతంలో

-
- అయోధ్యలో ఆలయం కాదు.. అదొక బిజినెస్ మాల్
- మొదట కాశీ కారిడార్ పేరుతో కట్టారు
- రాబోయే రోజుల్లో మథుర మాల్
- రాజకీయాల కోసం మతాన్ని వాడుతున్నారు
- అసంపూర్ణ ఆలయంలో ప్రాణప్రతిష్ఠా?
- సనాతన విలువలు పాటించని మోదీ
- కాశీ విశ్వనాథ ఆలయ మాజీ పర్యవేక్షకుడు మహంత్ రాజేంద్ర ప్రసాద్ తివారి
- పది తరాలుగా కాశీ విశ్వనాథుని సేవలో కుటుంబం
వారణాసి: పురాతన ఆలయాలను పునరుద్ధరించే పేరుతో వాటిని బిజినెస్ మాల్స్‌గా మార్చివేస్తున్నారని వారణాసి విశ్వనాథ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను గతంలో నిర్వహించిన మహంత్ రాజేంద్ర ప్రసాద్ తివారి విమర్శించారు. ఇప్పటికే కాశీ విశ్వనాథ ఆలయంలో కారిడార్ పేరుతో మాల్ తెచ్చారని, ఇప్పుడు అయోధ్యలో నిర్మించారన్న తివారి.. రాబోయే మాల్ మథురలో ఉండబోతున్నదని ఎద్దేవా చేశారు. తివారి కుటుంబం పది తరాలకు పైగా విశ్వనాథ దేవాలయ పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించింది. 17వ శతాబ్దంలో తివారీ పూర్వీకులను నాటి మొఘల్ యువరాజు ఈ మేరకు బాధ్యతలు అప్పగించారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఒక వార్తా సంస్థ రాజేంద్ర ప్రసాద్ తివారిని పలుకరించగా, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న బీజేపీ తీరును ఆయన వివరించారు.
మోదీ అవసరాలకే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ
మోదీ మానస పుత్రికగా చెప్పే కాశీ విశ్వనాథ కారిడార్ ప్రాజెక్టును తివారీ తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు 286 శివలింగాలు ఉన్న అక్కడి అనేక పురాతన ఆలయాలను కూల్చివేసి కారిడార్‌ను అభివృద్ధి చేశారు. ఇది మతిలేని చర్య అని తివారి తరచూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటారు. అదెలా ఉన్నా.. అయోధ్యలో రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతున్నదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎందుకునని అడిగితే.. రాజకీయాల్లో సూపర్‌స్టార్ మాదిరిగా తయారైన మోదీ తన రాజకీయ అవసరాలకోసం హడావుడిగా ప్రాణప్రతిష్ఠ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సమాజ ఆధ్యాత్మిక అవసరాలకోసం చేపట్టింది కాదని, కేవలం బీజేపీ రాజకీయ కార్యక్రమమని ఆయన దుయ్యబట్టారు. మోదీ రాజకీయ అవసరాలకు ఉద్దేశించిందని చెప్పారు. ఇటీవల కాశీ విశ్వనాథ ఆలయ సందర్శన సందర్భంగా మోదీ భారీ కటౌట్‌లను ఆలయ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన అంశాన్ని తివారీ ప్రస్తావిస్తూ.. గతంలో లాల్ బహూదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వంటి ప్రధాన మంత్రులు ఆలయాలను సందర్శించారని, కానీ వారెవరూ తమ నిలువెత్తు పోస్టర్లు వేయించుకోలేదని అన్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికి మించి నిర్మాణం సగంలో ఉన్న అయోధ్య రామాలయంలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నలుగురు శంకరాచార్యులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
రామనవమికి చేసి ఉంటే బాగుండేది
ఏప్రిల్ 16వ తేదీన రాముడి పుట్టిన రోజైన రామనవమి నాటికి ఆలయాన్ని పూర్తి చేసి, విగ్రహానికి ప్రాణప్రతిష్ఠి చేయడంలో ఔచిత్యం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ.. అప్పటికి లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉంటాయి. ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది. ‘రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని మోదీ కోరుకుంటున్నారు. రాముడు మోదీ శక్తి, ఆయన నమ్మకం, ఆయన వ్యాపారం’ అని ఆయన విమర్శించారు. అందుకే హడావుడిగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారని విశ్లేషించారు. దేశంలోని పురాతన, పవిత్ర క్షేత్రాలను వ్యాపార కేంద్రాలుగా మార్చివేస్తున్నారని, వాటిని పర్యాటక కేంద్రాలుగా మార్చుతున్నారని తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీకి సనాతన విలువల్లేవు
‘అయోధ్యలో ఉన్నది రామాలయం కాదు.. అదొక వ్యాపార మాల్. ఇలాంటిది మొదటిది కాశీ విశ్వనాథుని ఆలయంలో నిర్మించారు. మూడోది మథురలో రాబోతున్నది’ అని ఆయన నిశితంగా విమర్శించారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించిన వారణాసికి చెందిన జోత్యిష్యుడికి కూడా ఆలయం పూర్తిగా నిర్మించకుండా ప్రాణ ప్రతిష్ఠ చేయరాదనే అంశం తెలుసునని చెప్పారు. అందుకే జనవరి 22 కార్యక్రమానికి వ్యతిరేకంగా శంకరాచార్యులు మాట్లాడారని గుర్తు చేశారు. సత్యానికంటే అసత్యాలే ఇంపుగా ఉంటాయని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంలో సత్యాన్నే పలకాలి, గర్వం, ఆగ్రహం వీడాలి, సహనంతో మెలగాలి తదితర పది విలువలు ఉన్నాయన్న తివారి.. ఈ విలువలన్నీ దిగజారుతున్నాయని, వీటిలో ఏ ఒక్కదాన్నీ మోదీ పాటించడం లేదని అన్నారు. పైగా ప్రజలందరినీ మతోన్మాదులుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ విలువలు క్షీణించినప్పుడు భగవానుడు అవతారం దాల్చుతాడన్న శ్లోకాన్ని ప్రస్తావించిన తివారి.. ఈ రోజు కూడా వాస్తవానికి, అవాస్తవానికి మధ్య తేడాను, రాముడి పేరుతో ఓట్లు దండుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించే శక్తిని, జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.