Ayodhya | నేటి నుంచి అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకలు
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల ఫలించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది

Ayodhya | దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల ఫలించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు మంగళవారం మొదలై ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 18న బాల రాముడి విగ్రహాన్ని గర్భాలయంలోకి తీసుకెళ్లనున్నారు. 22న ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రస్తుతం ఉన్న విగ్రహం 70 సంవత్సరాలుగా పూజలందుకుంటుంది. కొత్తగా నిర్మిస్తున్న ఆలయంలోనూ పాత విగ్రహాన్ని సైతం ఉంచనున్నట్లు జన్మభూమి ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. 22న ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేద పండితులు మధ్యాహ్నం 12.20 గంటల నుంచి ప్రారంభిస్తారన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు పూజా క్రతువులు కొనసాగుతాయని తెలిపారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు పలువురు ప్రముఖులు 75 నిమిషాల పాటు సందేశాలు ఇస్తారని చంపత్‌రాయ్ పేర్కొన్నారు.
వేడుకకు హాజరయ్యే అతిథులు ఉదయం 10.30 గంటలకు రామజన్మ భూమి కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని.. ఆలయంలో 8వేల కుర్చీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25 సంగీత వాయిద్యాలతో కళాకారులు రామ్‌లాలాకు నీరాజనం అర్పిస్తారన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం సమయాన్ని కాశీకి చెందిన ప్రముఖ పండితులు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నిర్ణయించారని.. వారణాసికి చెందిన ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేదాచార్యులు మొత్తం క్రతువును నిర్వహిస్తారన్నారు. 150కిపైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మతపెద్దలు, గిరిజనులతో పాటు ఆలయ నిర్మాణంలో పాల్గొన్న 500 మంది కార్మికులు సైతం పాల్గొంటారని చంపత్‌రాయ్ తెలిపారు.
ప్రాణ ప్రతిష్ఠ జరిగేది ఇలా..
నేటి ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా రాముడి విగ్రహాన్ని 18న ఆలయానికి తీసుకెళ్లనున్నారు. ఆలయంలో ఇవాళ ప్రాయశ్చిత్తం, కుర్మకుటి ఆరాధన తదితర క్రతవులు జరుగనున్నాయి. 17న ప్రాగణంలోకి విగ్రహ ప్రవేశం ఉంటుంది. 18న తీర్థయాత్ర, జలయాత్ర, జలధివాస్, గంధాధివాస్ నిర్వహిస్థారు. 19న ఔవషధివాస్, కేశరాధివాస్, ఘృతాధివాస్, 20న షర్కారధివాస్, ఫలధివాస్, పుష్కధివాస్, 21న మధ్యాధివాస్, సాయంత్ర శయ్యధివాస్ తదితర క్రతవులు కొనసాగుతాయని చంపత్‌రాయ్ తెలిపారు. కొత్త విగ్రహాన్ని శ్యామ్ శిలతో తయారు చేసినట్లు పేర్కొన్నారు. 150 నుంచి 200 కిలోల వరకు బరువు ఉంటుందని చెప్పారు. ఐదు సంవత్సరాల బాలుడిగా రాముడి విగ్రహాన్ని చెక్కినట్లు ఆయన తెలిపారు. గర్భాలయంలో ప్రతిష్ఠాపన తర్వాత 23 నుంచి సామాన్యులకు రాముడి దర్శనం ఉంటుందని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా అయోధ్యకు వచ్చే భక్తులు వచ్చిన రోజే దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చంపత్‌రాయ్ తెలిపారు. వేడుకలకు ప్రపంచంలోని 50 దేశాల నుంచి 53 మందిని ఆహ్వానించినట్లు తెలిపారు.