50 ఏళ్ల పైబ‌డిన వారి జ్ఞాప‌క‌శ‌క్తిపై కొవిడ్ దాడి.. వెల్ల‌డించిన అధ్య‌య‌నం

50 ఏళ్ల పైబ‌డిన వారి జ్ఞాప‌క‌శ‌క్తిపై కొవిడ్ దాడి.. వెల్ల‌డించిన అధ్య‌య‌నం

కొవిడ్ (Covid-19) మహ‌మ్మారి నుంచి ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ .. దాని దుష్ప్ర‌భావాలు మాత్రం మాన‌వాళిపై కొన‌సాగుతున్నాయి. ఆ వైర‌స్ వ‌ల్ల దీర్ఘ‌కాలంలో గుండెపోటు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్యలు చుట్టుముట్టే ప్ర‌మాదం ఉంద‌ని ఇప్పటికే అనేక ప‌రిశోధ‌న‌లు రుజువు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా కొవిడ్ వ‌ల్ల 50 ఏళ్లు పైబ‌డిన వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి (Brain Health) చాలా వేగంగా త‌గ్గిపోయింద‌ని ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. విచిత్రంగా కొవిడ్ సోక‌నివారిలో సైతం ఈ స‌మ‌స్య క‌న‌ప‌డింద‌ని పేర్కొంది.


ద లాన్సెట్ హెల్తీ లాంగివిటీ జ‌ర్న‌ల్‌లో ఈ అధ్య‌య‌న ప‌త్రం ప్ర‌చురిత‌మైంది. దీని ప్ర‌కారం కొవిడ్ అనంత‌రం.. 50 ఏళ్లు, అంత‌కు మించి వ‌య‌సు పైబ‌డిన వారి మెదడు ఆరోగ్యం చాలా వేగంగా ప‌త‌న‌మైంది. అధ్య‌య‌నంలో భాగంగా ప‌రిశోధ‌కులు యూకేకు చెందిన‌ 3000 మంది వాలంటీర్ల‌ను ప‌రీక్ష‌ల‌కు ఎంపిక చేశారు. వీరిలో 50 నుంచి 90 ఏళ్ల వ‌య‌సున్న వారు ఉన్నారు. వీరందరికీ ఆన్‌లైన్‌లోనే ప్రొటెక్ట్ అనే మెదడు సామ‌ర్థ్యం నిర్థారించే ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.


అనంత‌రం ఫ‌లితాల‌ను విశ్లేషించ‌గా.. కొవిడ్ తొలిసారి వ‌చ్చిన 2020 మార్చి నుంచి 2021 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య 50 ఏళ్లు దాటిన వారి విశ్లేష‌ణ సామ‌ర్థ్యం, జ్ఞాప‌క‌శ‌క్తి వేగంగా త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు తేలింది, ఇదే పోక‌డ రెండో వేవ్ వ‌చ్చిన 2022లోనూ కొన‌సాగింది. అయితే రెండు వేవ్‌ల్లోనూ కొవిడ్ బారిన‌ప‌డ‌ని వారికీ ఈ స‌మ‌స్య త‌ప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


గ‌తంలో ఎన్న‌డూ లేని లాక్‌డౌన్ సంస్కృతి వ‌ల్లే ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ట్లు ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు. యూకేలో మూడు సార్లు లాక్‌డౌన్‌లు విధించ‌గా ఆ కాలం మొత్తం ఆరు నెల‌ల‌కు స‌మానం. ఆ స‌మ‌యంలో శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, మెద‌డుకు మేత ల‌భించే ప‌నులేమీ చేయ‌క‌పోవ‌డం, కొంతమంది ఉద్యోగాలు కూడా చేయ‌క‌పోవ‌డంతో మెద‌డు విశ్రాంతి స్థితిని అల‌వ‌ర‌చుకుంద‌ని తెలిపారు. దీని వ‌ల్ల దాని సామ‌ర్థ్యంలో స్త‌బ్ద‌త ఏర్ప‌డింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.