అమెరికాలో హిందూ దేవాలయం ధ్వంసం – ఖలిస్తానీల విద్వేషపు రాతలు

అమెరికాలో హిందూ దేవాలయం ధ్వంసం.. ఖలిస్తానీ ముద్రతో జరిగిన ఈ దాడి వెనుక ఏం జరుగుతోంది?

అమెరికాలో హిందూ దేవాలయం ధ్వంసం – ఖలిస్తానీల విద్వేషపు రాతలు

అమెరికా, ఇండియానా రాష్ట్రంలోని గ్రీన్‌వుడ్ పట్టణంలో ఉన్న హిందూ BAPS శ్రీ స్వామినారాయణ్​ మందిరం ఆగస్టు 10 తెల్లవారుజామున దుండగుల దాడికి గురైంది. గోడలపై భారత వ్యతిరేక గ్రాఫిటీ స్ప్రే చేసి, ఖలిస్తానీ భావజాలాన్ని ప్రదర్శించేలా ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఈ సంఘటనను ‘విద్వేష నేరం’గా పేర్కొంటూ, ప్రజాప్రతినిధులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఒకే సంవత్సరంలో హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరగడం ఇది నాలుగోసారి. గతంలో కూడా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో హిందూ ఆలయాలపై భారత వ్యతిరేక  నినాదాలతో విధ్వంసకాండ జరిగిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈసారి, కృష్ణ జయంతి వేడుకలకు కేవలం కొన్ని రోజుల ముందే ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


HAF తమ అధికారిక X  అకౌంట్‌లో ఫొటోలు షేర్​ చేస్తూ, “అమెరికన్ హిందువులను ‘హిందుత్వ’గా అపహాస్యం చేయడం ఇలాంటి ద్వేషాన్ని ఇంకా రెచ్చగొడుతోంది” అని వ్యాఖ్యానించింది. మందిర వాలంటీర్లు ఈ దాడిని “హిందువులపై ద్వేషం, అసహనం”గా వర్ణించారు. BAPS పబ్లిక్ అఫైర్స్ విభాగం కూడా ఈ చర్య తమ సంఘాన్ని మరింత ఐక్యంగా నిలబడేలా చేస్తుందని స్పష్టం చేసింది.

ఇకపోతే, ఇదే తరహా ఘటన ఈ సంవత్సరం మార్చిలో కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని మరో BAPS దేవాలయంలోనూ చోటుచేసుకుంది. అక్కడ కూడా గోడలపై ఖలిస్తానీ ప్రమేయంతో భారత వ్యతిరేక నినాదాలు రాసారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనలు అమెరికాలో హిందూ దేవాలయాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

Read More :

Speaker Options | ఉప ఎన్నికలు వస్తాయా? సుప్రీం తీర్పు నేపథ్యంలో స్పీకర్‌ ముందు ఆప్షన్లు అవే!

వార్ 2, కూలీ టికెట్ ధరలు ఎందుకు పెంచలేదు? తెలంగాణ నిర్ణయం వెనుక ఆసక్తికర కారణం!

లిబర్టీ స్టాట్యూను మించిపోయిన మహావిష్టువు విగ్రహం – భారత్​లో కాదు