World War III | ఇరాన్‌ ఆ దిగ్భ్రాంతికర చర్యలు తీసుకుంటే మూడో ప్రపంచ యుద్ధమే?

ఇరాన్‌పై అమెరికా దాడులను ఐక్య రాజ్య సమితిలోని రష్యా ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. బాధ్యతారహితమైన, ప్రమాదకర, రెచ్చగొట్టుడు చర్యగా ఆ దాడులను ఆయన అభివర్ణించారు. కందిరీగల తుట్టెను అమెరికా తెరిచిందని, కొత్త విపరిణామాలు, ఇబ్బందులు ఏం ఎదురవుతాయో ఎవరూ చెప్పలేరని ఆయన వ్యాఖ్యానించారు.

World War III | ఇరాన్‌ ఆ దిగ్భ్రాంతికర చర్యలు తీసుకుంటే మూడో ప్రపంచ యుద్ధమే?

World War III  | ఇరాన్‌ అణు కేంద్రాలైన ఫోర్డో, ఇస్ఫాన్‌, నటాన్జ్‌లపై అమెరికా దాడి నేపథ్యంలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం నాటకీయ మలుపు తీసుకున్నది. 1979 విప్లవకాలం మొదలుకుని ఇప్పటి వరకూ ఇరాన్‌పై పశ్చిమ దేశాల సైనిక చర్య ఇదే అతిపెద్దది. దీంతో.. ఈ దాడులకు ఇరాన్‌ ఎలా స్పందిస్తుందోనని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రపంచ చమురు సరఫరాలను అడ్డుకుంటామని ఇరాన్‌ బెదిరించినా.. ఇప్పటి వరకూ ఆ చర్యలు తీసుకున్నది లేదు. అయితే.. ఇరాన్‌ ఏ మాత్రం తప్పటడుగు వేసినా.. పరిస్థితిని అది మరింత తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే భయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఖ్చి ఇస్తాంబుల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాల ప్రతిస్పందనలను తమ దేశం పరిశీలిస్తుందని చెబుతూనే.. ప్రతీకారం తీర్చుకునేంత వరకూ దౌత్య మార్గానికి రాదని ప్రకటించడం గమనార్హం.

ఇరాన్‌కు ఉన్నమార్గాలివి..

అమెరికా స్థావరాలపై దాడులు చేయడం, ప్రపంచ చమురు సరఫరాలకు కీలకమైన హోర్మూజ్‌ జలసంధిని మూసివేయడం లేదా.. అమెరికా సేనలు నిర్వహిస్తున్న గల్ఫ్‌లోని చమురు స్థావరాలపై దాడులు చేయడం ఇరాన్‌కు ఉన్న మార్గాలుగా కనిపిస్తున్నాయని జియోపాలిటిక్స్‌, భద్రతా విశ్లేషకుడు మైఖేల్‌ ఏ హోరోవిట్జ్‌ పేర్కొన్నారని ఏఎఫ్‌పీ తెలిపింది. ఇతర దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేస్తే.. అమెరికా సైతం ప్రతిదాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో అనేక దేశాలు ఆ దాడులు తమ దేశంపై చేసినవిగా భావించే పరిస్థితులూ ఉంటాయి. అది యుద్ధం విస్తృతిని పెంచుతుందని విదేశాంగ వ్యవహారాల నిపుణులు సుశాంత్‌ సరీన్‌ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో అన్నారు. హోర్మూజ్‌ జల సంధి ద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే ఐదో వంతు చమురు రవాణా అవుతూ ఉంటుంది. ఇరాన్‌ కనుక దీనిని మూసివేయాలని ప్రయత్నిస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని సరీన్‌ చెప్పారు. తద్వారా అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతాయని అన్నారు. ఇదే అంశం మీద అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. జలసంధిని మూసివేసేందుకు ఏ ప్రయత్నం చేసినా.. అది పరిస్థితిని ఎగదోస్తుందని, అమెరికా, ఇతర దేశాలు దాడి చేసేందుకు అవకాశం కల్పించినట్టు అవుతుందని హెచ్చరించారు. జూన్‌ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ సైనిక చర్యను ప్రారంభించింది. ఆ వెంటనే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుండి వైదొలగాలనే దృఢ సంకల్పాన్ని ఇరాన్‌ ప్రస్తావిస్తున్నది. అదే జరిగితే పరిస్థితులు చేజారిపోతాయని, అమెరికా బలంగా ప్రతిస్పందించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

ఇరాన్‌కు రష్యా మద్దతు ఇస్తుందా?

ఇరాన్‌పై అమెరికా దాడులను ఐక్య రాజ్య సమితిలోని రష్యా ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. బాధ్యతారహితమైన, ప్రమాదకర, రెచ్చగొట్టుడు చర్యగా ఆ దాడులను ఆయన అభివర్ణించారు. కందిరీగల తుట్టెను అమెరికా తెరిచిందని, కొత్త విపరిణామాలు, ఇబ్బందులు ఏం ఎదురవుతాయో ఎవరూ చెప్పలేరని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు రష్యాతో చర్చల నిమిత్తం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఖ్చి ఆదివారం మాస్కో చేరుకున్నారు. యుద్ధంలో ఇరాన్‌కు రష్యా మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని ఐరాసలో దాని ప్రతినిధి మాటలను బట్టి అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.

హైపర్‌సోనిక్‌ క్షిపణుల ఉత్పత్తికి పుతిన్‌ ఆదేశాలు!

హైపర్‌ సోనిక్‌ క్షిపణుల తయారీని వేగవంతం చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్‌ పుతిన్‌ ఆదేశించడం కూడా మూడో ప్రపంచ యుద్ధ భయాలకు మరింత ఆజ్యం పోసింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా నిర్వహించిన దాడుల నేపథ్యంలో పుతిన్‌ నిర్ణయం తీవ్ర చర్చనీయంగా మారింది.

ఇవి కూడా చదవండి..

qatar role ceasefire | ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణకు ఖతార్‌ మధ్యవర్తిత్వం!