అంగారకుడిపై ధూళి దెయ్యం.. వీడియో తీసి పంపిన పర్సెవరెన్స్

విధాత: అంగారకుని (Mars)పైకి నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ (Perseverance) రోవర్ అక్కడ కలయతిరుగుతోంది. ప్రస్తుతం అది పంపిన ఒక వీడియోను నాసా ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అంగారకునిపై ధూళి భూతం మీకు కనిపిస్తోందా అని ఆ పోస్టుకు ఒక వ్యాఖ్యను సైతం జోడించింది. ఇంతకూ అది ఏమిటనే విషయాన్ని నాసా శాస్త్రవేత్తలే వెల్లడించారు. అది ఒక ధూళి టోర్నడో అని వారు పేర్కొన్నారు.
భూమి మీద అమెరికా తదితర ప్రాంతాల్లో ఏర్పడినట్లే అంగారకుడి మీదా టోర్నడోలు ఏర్పడతాయి. పర్సెవరెన్స్ 899వ రోజైన ఆగస్టు 30వ తేదీన ఈ వీడియో ను నాసాకు పంపించింది. సాధారణంగా అయితే అంగారకుడిపై ఏర్పడే టోర్నడోలు భూమి పైన ఏర్పడే వాటితో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ వీడియోలో కనపడుతున్న టోర్నడో చాలా పెద్దదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పర్సెవరెన్స్ పంపిన వీడియోలో మొత్తం దాని తుది మొదలు కనపడకపోయినప్పటికీ నీడ ఆధారంగా దాని పొడవు, వెడల్పులపై ఒక అంచనాకు వచ్చారు. ఈ టోర్నడో పొడవు సుమారు 2 కి.మీ. ఉంటుందని. వెడల్పు 200 మీటర్లు ఉండొచ్చని తెలిపారు. యూఎస్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఈ ఎత్తు 5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. మార్స్‌పై ఉన్న థోరోఫేర్ రిడ్జ్ అనే ప్రాంతంలో ఈ టోర్నడో ఏర్పడింది. దానిని చిత్రీకరిస్తున్నపుడు పర్సెవరెన్స్ రోవర్ ఆ టోర్నడోకు సుమారు 4 కి.మీ. దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలాంటి టోర్నడోలు మార్స్ ఉపరితలంపై ఎందుకు ఏర్పడతాయనే దానిపై నాసా కొన్ని ఊహాగానాలు చేస్తోంది. ఉపరితలంపై దుమ్మును సమానంగా ఉంచడానికే అక్కడి వాతావరణంలో ఈ ఏర్పాటు ఉండి ఉండొచ్చని భావిస్తోంది. మొత్తానికి నాసా పంచుకున్న వీడియోలో సినిమాలో ఒక తెల్లని దుస్తులు వేసుకున్న దెయ్యం కనిపించి మాయమైన రీతిలో టోర్నడో కదలాడుతున్నట్లు ఉంది. ఈ వీడియోను చూసి భయపడ్డామని కొందరు కామెంట్లు కూడా చేయడం విశేషం.