Sheikh Hasina | త్రిపురలో దిగిన షేక్ హసీనా హెలికాప్టర్!..
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. బంగబంధు భవన్ నుంచి హెలికాప్టర్‌లో త్రిపుర చేరుకున్నట్టు తెలుస్తున్నది. అక్కడి నుంచి ఆమె ఢిల్లీ వెళతారని సమాచారం

అటు నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశం
భారత్‌ను సురక్షిత ప్రాంతంగా ఎంచుకోవడం వెనుక!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. బంగబంధు భవన్ నుంచి హెలికాప్టర్‌లో త్రిపుర చేరుకున్నట్టు తెలుస్తున్నది. అక్కడి నుంచి ఆమె ఢిల్లీ వెళతారని సమాచారం. వేల మంది తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో ఆమె పరారైన విషయం తెలిసిందే. ప్రధాని నివాసంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు లోపల యథేచ్ఛగా సంచరించారు. ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి.. బెడ్‌పై పడుకుని వీడియోలు తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. తమ కీలక డిమాండ్ అయిన ప్రధాని రాజీనామా నెరవేరడంతో ఆందోళనకారులు పండుగ చేసుకుంటున్నారు.
భారత్‌కే ఎందుకు?
బంగ్లాదేశ్‌లో పదిహేనేళ్ల హసీనా పాలన సోమవారం ముగిసింది. ఆమె దేశం వదిలి వెళ్లిపోయిన విషయాన్ని ఆర్మీ చీఫ్ వాకెర్ ఉజ్ జమాన్ టెలివిజన్ ప్రసంగంలో ధృవీకరించారు. మిలిటరీ హెలికాప్టర్‌లో తన సోదరితో కలిసి హసీనా త్రిపుర చేరుకున్నట్టు తెలుస్తున్నది. కొన్ని వార్తల ప్రకారం ఆమె ఢిల్లీకి చేరాల్సి ఉన్నది. వీటిని ఎవరూ ధృవీకరించలేదు. అయితే భారత్‌నే ఆమె ఎందుకు ఎంచుకున్నారన్న విషయంలో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
కొన్నేళ్లుగా హసీనా ప్రభుత్వానికి భారత్ మద్దతు ఇస్తున్నది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పలు ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకుంటున్నది. వీటిలో ఎక్కువ రాష్ట్రాలు దశాబ్దాలుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారంలో బంగ్లాదేశ్ స్నేహపూర్వక ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నది.
షేక్ హసీనా తన పాలనా కాలంలో భారత వ్యతిరేక ఉగ్రవాద మూకలపై ఉక్కుపాదం మోపారు. బంగ్లాతో భారతదేశం సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇది కారణమైందని బీబీసీ వార్తా సంస్థ పేర్కొన్నది. బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల రవాణా అవసరాలకు కూడా హసీనా సర్కార్ అవకాశం కల్పించింది. 1996లో ప్రధానిగా ఎన్నికైంది మొదలు భారత్‌తో ఆమె సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. 2022లో భారత సందర్శనకు వచ్చిన సమయంలో కూడా 1971 బంగ్ల విమోచన యుద్ధంలో భారతదేశం సహకరించిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే భారత్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తల నుంచి విమర్శలు కూడా ఉన్నాయి. భారతదేశం ఒక పొరుగు దేశానికి మద్దతు ఉండాలి కానీ.. దేశంలోని పార్టీకి కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
షేక్ హసీనా ఇంటిలో ఆందోళనకారుల విధ్వంసం..
షేక్ హసీనా నివాసంలోకి వందల మంది ఆందోళనకారులు చొచ్చుకుపోయారు. ఆమె చాంబర్‌ను ధ్వంసం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయ ప్రాంగణంలోనూ విధ్వంసం సృష్టించారు. అక్కడితో ఆగని ఆందోళనకారులు పలు రోడ్ల కూడళ్లలోని హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.