Matthew Miller | భారత్ – పాకిస్థాన్ మధ్య చర్చలు కోరుకుంటున్నాం : అమెరికా
Matthew Miller | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తున్నామని అమెరికా (USA) తెలిపింది. అయితే చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఆ రెండు దేశాలే నిర్ణయించాలని పేర్కొంది. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. భారత్, పాకిస్థాన్ రెండింటితోనూ బంధానికి అమెరికా విలువిస్తోందని అన్నారు.

Matthew Miller : భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తున్నామని అమెరికా (USA) తెలిపింది. అయితే చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఆ రెండు దేశాలే నిర్ణయించాలని పేర్కొంది. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. భారత్, పాకిస్థాన్ రెండింటితోనూ బంధానికి అమెరికా విలువిస్తోందని అన్నారు.
మీడియా అడిగిన మరో ప్రశ్నకు మిల్లర్ బదులిస్తూ.. ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాకిస్థాన్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా అందులో భాగమన్నారు. ఈ మేరకు పాకిస్థాన్ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే విధానాన్ని వీడాలని భారత్ పదేపదే పాకిస్థాన్ చెబుతోంది. ఆ తర్వాతే ఇరుదేశాల మధ్య చర్చలు, సత్సంబంధాలకు బాటలు పడతాయని స్పష్టంచేసింది. అయినా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ భద్రతకు ముప్పు తలపెట్టే కుటిల యత్నాలకు దిగుతోంది.
ఇలా ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలకు పిలిస్తే తాము అంగీకరించేది లేదని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావు లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ మాత్రం తాను చేసే కుటిలయత్నాలు చేస్తూనే.. భారత్ ఇరుదేశాల మధ్య శాంతికి సహకరించడంలేదని అంతర్జాతీయ వేదికలపై అమాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది.