Kaleshwaram project| కాళేశ్వరంపై హైకోర్టులో మరోసారి కేసీఆర్, హరీష్ లకు చుక్కెదురు

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నిర్మాణంపై సీబీఐ విచారణ(CBI investigation)ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీష్ రావులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ కోరనున్నట్లుగా చేసిన ప్రకటనపై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను వారు కోర్టుకు వివరించారు. సీబీఐ విచారణపై ప్రభుత్వాన్ని రేపటిలోగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కేసీఆర్, హరీష్ లు హైకోర్టును కోరారు. రేపు కాళేశ్వరం నివేదిక రద్దు కోరుతూ తామువేసిన పిటిషన్లపై విచారణ ఉందంటూ గుర్తు చేశారు. వారి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏం చర్యలు తీసుకుంటారో రేపటిలోగా కోర్టుకు తెలుపాలని ప్రభుత్వాన్ని అదేశించింది. అత్యవసర విచారణ చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరిస్తూ రేపు విచారణ చేస్తామని పేర్కొంది.
కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదని దానిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా..అసెంబ్లీలో చర్చించాకే చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేయడంతో మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తూ విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. తాజాగా మరోసారి అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను వ్యతిరేకిస్తూ కేసీఆర్, హరీష్ రావులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక ప్రవేశపెట్టి సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పడంతో దీనిపై మరోసారు వారు కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ విచారణ ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం నివేదిక..ప్రభుత్వ నిర్ణయాలపై రేపు మంగళవారం హైకోర్టులో విచారణ జరుగనుంది.