Rajgopal Reddy Vs Revanth Reddy| మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఎటాక్!

విధాత: సీఎం రేవంత్ రెడ్డి( Cm Revanth Reddy)తో ఉప్పు నిప్పుగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komati Reddy Raj Gopal Reddy) తాను ఆశించిన మంత్రి పదవి రాకపోవడంతో మరింత అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో వీలైనప్పుడల్లా రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల మరో పదేళ్లు సీఎంగా నేనే అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టుల(Social Media Journalists)పై చేసిన వ్యాఖ్యలను సైతం రాజగోపాల్ రెడ్డి తప్పబడుతూ నేరుగా విమర్శలు గుప్పించడం కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో విభేదించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందన్నారు. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నేరుగా విమర్శలు సంధిస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది.