ఓటులో యువతకు స్పూర్తి జోహరా బీ
ఓటేసేందుకు బద్ధకిస్తున్న యువతకు శతాధిక వృద్ధురాలు ఆదర్శంగా నిలిచారు. 1952 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు

- సిద్దిపేటలో ఓటేసిన 104 ఏండ్ల వృద్ధురాలు
- 1952 నుంచి జరిగి ప్రతి ఎన్నికల్లోనూ
- ఓటు హక్కు వినియోగించుకుంటూ ఆదర్శం
విధాత: ఓటేసేందుకు బద్ధకిస్తున్న యువతకు శతాధిక వృద్ధురాలు ఆదర్శంగా నిలిచారు. 1952 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నడవలేని స్థితిలో కూడా వీల్‌చైర్‌లో వచ్చి ఓటేసి ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను చాటారు. ఆమే సిద్దిపేటకు చెందిన జోహరా బీ.
సిద్దిపేట పట్టణంలోని బొర్రా హనుమాన్ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న జోహరా బీ వయస్సు 104 సంవత్సరాలు. గురువారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఓటు వేశారు. 1952 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన తల్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఆమె కుమారుడు ఫయాజ్ తెలిపారు. ఆమె ప్రతి ఎన్నికలకు తప్పకుండా పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటు వేస్తుండటం వల్ల తమ కుటుంబానికి, స్థానిక యువతకు ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.
105 ఏండ్ల రుక్కమ్మ కూడా..
జగిత్యాలకు చెందిన 105 ఏండ్ల రుక్కమ్మ కూడా గురువారం నాడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని జెడ్పీ హైస్కూల్‌లో ఆమె ఓటు వేశారు. కుటుంబ సభ్యుల సహాయంతో వీల్‌చైర్‌లో పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు.