త‌మిళ‌నాడులో భారీ పేలుడు.. 10 మంది మృతి

త‌మిళ‌నాడులోని విరుధ్‌న‌గ‌ర్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ పటాకుల ఫ్యాక్ట‌రీలో శ‌నివారం పేలుడు సంభవించింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

  • By: Somu    latest    Feb 17, 2024 10:59 AM IST
త‌మిళ‌నాడులో భారీ పేలుడు.. 10 మంది మృతి

చెన్నై : త‌మిళ‌నాడులోని విరుధ్‌న‌గ‌ర్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ పటాకుల ఫ్యాక్ట‌రీలో శ‌నివారం పేలుడు సంభవించింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.


స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ప‌టాకుల ఫ్యాక్ట‌రీలో చెల‌రేగిన మంట‌ల‌ను అగ్నిమాప‌క సిబ్బంది అదుపు చేసింది. ఫ్యాక్ట‌రీలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌రో ముగ్గురు మృతి చెందారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.


అయితే ఈ పేలుడు ధాటికి ప‌క్క‌నే ఉన్న నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం కూడా దెబ్బ‌తిన్న‌ట్లు స్థానికులు తెలిపారు. ఫ్యాక్ట‌రీలోని కెమిక‌ల్స్ మిక్సింగ్ గ‌దిలో ఈ పేలుడు సంభ‌వించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కంపెనీ య‌జ‌మానిని వెంబ‌కొట్టైకి చెందిన‌ విజ‌య్‌గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పేలుడు సంభ‌వించిన స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో సుమారు 200 మంది కార్మికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.


గ‌తేడాది త‌మిళ‌నాడులోని కృష్ణ‌గిరి జిల్లాలో ప‌టాకుల ఫ్యాక్ట‌రీలో పేలుళ్లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.