దశాబ్దాల కల నెరవేరబోతున్న వేళ.. నేడు సిద్దిపేటకు రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ

విధాత: సిద్దిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. తొలిసారిగా రైలు కూతపెట్టబోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ రైలును వర్చువల్ విధానంలో పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట (నర్దాపూర్) రైల్వేస్టేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జెండాఊపి రైలును ప్రారంభిస్తారు.
రైలు (ట్రైన్ నంబర్ 07706) సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. బుధవారం నుంచి సిద్దిపేట – సికింద్రాబాద్ మార్గంలో రాకపోకలు సాగనున్నాయి. నేటి నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించినా.. సికింద్రాబాద్‌కే ఎక్కువగా ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో సికింద్రాబాద్ నుంచే సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు.
రైలు టైమింగ్స్
07483 నెంబర్ ప్యాసింజర్ రైలు సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరుతుంది. 10.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. 07484 నంబర్ గల రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటుంది.
మళ్లీ తిరిగి మధ్యాహ్నం 2.05 గంటలకు సిద్దిపేట నుంచి బయలుదేరి సాయంత్రం 5.10గంటలకు సికింద్రాబాద్‌కు చేరనుంది. సాయంత్రం 5.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుటుంది. ప్రస్తుతం ప్యాసింజర్ రైలును మాత్రమే ప్రారంభిస్తుండగా.. త్వరలో తిరుపతి, బెంగళూరు తదితర నగరాలకు సైతం రైలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.
కొత్తపల్లి వరకు లైన్..
వాస్తవానికి రైలు మార్గం మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు వేయాల్సి ఉంది. మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ ప్రారంభమై గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, వెదిర మీదుగా వెళ్తూ పెద్దపల్లి- నిజామాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద రైలు లైన్ కలవాల్సి ఉంది. రైల్వే లైన్ పొడవుడు 151.36 కిలోమీటర్లు కాగా.. రూ.1160.47 కోట్ల అంచనాతో పనులను ప్రతిపాదించారు.
రైల్వేలైన్ నిర్మాణానికి సుమారుగా 2,200 ఎకరాలు అవసరం ఉండగా సిద్దిపేట జిల్లాలో భూసేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించారు. మిగతా సిరిసిల్ల జిల్లాలో 954 ఎకరాల భూసేకరణకు 808 ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. రైల్వేలైన్ నాలుగైదు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు.
మెదక్ జిల్లాలో 9.30, సిద్దిపేట జిల్లాలో 83.40, సిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ వేయాల్సి ఉంది. ఇక నాలుగు జిల్లాలో 15 రైల్వే స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. రైలు సేవలు సైతం ప్రారంభంకాబోతున్నాయి.