పైసలుంటే అంతేమరి: ఆ.. జర్నలిస్ట్‌ నోరు మూతకే ఆదానీ NDTV కొనుగోలు!

విధాత: అధికార, ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుకొనే వారికి తమదైన ప్రచార అస్త్రం అత్యవసరం అవుతుంది. దీనికి మోదీ కానీ, గౌతం ఆదానీ కానీ మినహాయింపు కాదు. యాధృచ్ఛికంగానే వీరిద్దరూ ప్రస్తుతం దేశంలో ఒకరికోసం ఒకరుగా పని చేస్తున్నారనే విమర్శ ఉన్నది. ఈ నేపథ్యంలోంచే అనతి కాలంలోనే అపర కుభేరుడిగా ఎదిగిన గౌతమ్‌ ఆదానీ తన సామ్రాజ్య విస్తరణకు మీడియా కూడా అవసరమని భావించాడు. దానికోసం తానే స్వయంగా ఓ టీవీ ఛానల్‌ ప్రారంభించొచ్చు. కానీ ఉన్న వాటిలోనే […]

పైసలుంటే అంతేమరి: ఆ.. జర్నలిస్ట్‌ నోరు మూతకే ఆదానీ NDTV కొనుగోలు!

విధాత: అధికార, ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుకొనే వారికి తమదైన ప్రచార అస్త్రం అత్యవసరం అవుతుంది. దీనికి మోదీ కానీ, గౌతం ఆదానీ కానీ మినహాయింపు కాదు. యాధృచ్ఛికంగానే వీరిద్దరూ ప్రస్తుతం దేశంలో ఒకరికోసం ఒకరుగా పని చేస్తున్నారనే విమర్శ ఉన్నది.

ఈ నేపథ్యంలోంచే అనతి కాలంలోనే అపర కుభేరుడిగా ఎదిగిన గౌతమ్‌ ఆదానీ తన సామ్రాజ్య విస్తరణకు మీడియా కూడా అవసరమని భావించాడు. దానికోసం తానే స్వయంగా ఓ టీవీ ఛానల్‌ ప్రారంభించొచ్చు. కానీ ఉన్న వాటిలోనే ఒక దాన్ని సొంతం చేసుకుంటే పోలా అనుకున్నాడు. అంతే ఎన్‌డీటీవీపై కన్నేశాడు.

ఎన్‌డీటీవీని సొంతం చేసుకోవాలనుకోవటానికి ఆదానీకి మరో కారణం కూడా ఉన్నది. తన వర్తక వాణిజ్యంలో ఇంటా బయటా తన అధికారాన్ని వినియోగించి సాయపడుతున్న మోదీకి తాను కూడా ఏదో రూపంలో సాయ పడాలి కదా..! శ్రీలంక ప్రభుత్వాన్ని అదిరించి బెదిరించి తన మాటతో ఆదానికి మోదీ ఎలా సాయం చేశాడో పత్రికల్లో చూసే ఉన్నాం.

అందుకే మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఎన్‌డీటీవీ నోరు మూయించాలనుకున్నాడు. మరీ ముఖ్యంగా ఎన్‌డీటీవీలో రవీష్‌కుమార్‌ అనే ప్రైమ్‌ టైమ్‌ యాంకర్‌ ఉన్నాడు. అతను ప్రభుత్వం చేస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక, అప్రజాస్వామిక చర్యలను అడుగడుగునా విమర్శిస్తున్నాడు, ఎండ గడుతున్నాడు. కాబట్టి రవీష్‌కుమార్‌ నోరు మూయాలంటే.. అతని ఉద్యోగం ఊడబెరకాలి. అందుకు ఏకంగా ఆదాని ఆ టీవీనే సొంతం చేసుకోవాలనుకొన్నాడు.

రవీష్‌కుమార్‌ దేశంలోనే ప్రఖ్యాత జర్నలిస్టు. 2019లో జర్నలిజంలో అతని వృత్తి నిబద్ధతతకు రామన్‌ మెగసెసె అవార్డు వచ్చింది. అంతటి నిబద్ధత గల జర్నలిస్టు రవీష్‌కుమార్‌ తన నిష్పాక్షిక జర్నలిస్టిక్‌ దృష్టి కోణంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు ఆదానీ కత్తి గట్టాడు. అతని ఉద్యోగాన్ని ఊడబెరికి నిరుద్యోగి చేయాలనుకున్నాడు. అందుకు వేల కోట్లు వెచ్చించి ఎన్‌డీటీవీని అక్రమంగా సొంతం చేసుకొన్నాడు.

ప్రభుత్వాలు, వాటికి బాసటగా నిలిచే వ్యాపారులు పత్రికా స్వేచ్ఛను ఎలా బందీ చేస్తారో సమకాలీన చరిత్రలో ఇది తాజా ఉదాహరణ. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఎంతటి దుశ్చర్యకైనా వెనుకాడని గుత్తాధిపత్య ధోరణికి ఇది అద్దం పడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యం ఏ దుస్థితికి చేరుకుంటుందోనన్న ఆందోళన ప్రజాస్వామ్య ప్రియులందరిలో వ్యక్వమవుతున్నది.