జగన్‌పై తిరుగుబావుటా..! మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి..?
జగన్ ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారి TDP వైపు చూస్తున్న YCP ఎమ్మెల్యేలు విధాత: ఒక నాయకుడి నిజరూపం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడాలని ఆనాడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలు ప్రపంచంలోని ప్రతినాయకుడికి వర్తిస్తాయి. జగన్ మా ప్రాణం..మేం చచ్చేదాకా ఆయనవెంటే ఉంటాం..లేదంటే రాజకీయాలు మానేస్తాం.. మాకు రాజకీయ జన్మనిచ్చింది జగన్. ఇదీ గత ఎన్నికల వరకూ వైసిపి అభ్యర్థులు.. ఎమ్మెల్యేల కామన్ స్టేట్మెంట్స్.. కానీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లు గడిచాక వారి మాట […]

- జగన్ ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారి
- TDP వైపు చూస్తున్న YCP ఎమ్మెల్యేలు
విధాత: ఒక నాయకుడి నిజరూపం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడాలని ఆనాడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలు ప్రపంచంలోని ప్రతినాయకుడికి వర్తిస్తాయి. జగన్ మా ప్రాణం..మేం చచ్చేదాకా ఆయనవెంటే ఉంటాం..లేదంటే రాజకీయాలు మానేస్తాం.. మాకు రాజకీయ జన్మనిచ్చింది జగన్.
ఇదీ గత ఎన్నికల వరకూ వైసిపి అభ్యర్థులు.. ఎమ్మెల్యేల కామన్ స్టేట్మెంట్స్.. కానీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లు గడిచాక వారి మాట మారింది.. వాస్తవానికి అధికారంలోకి వచ్చాక వారి తీరు మారిందా జగన్ తీరు మారిందా తెలీడం లేదు కానీ మొత్తానికి వైసిపి ఎమ్మెల్యేలు ఉక్కపోతకు గురవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
వై నాట్ 175 అనే భారీ టార్గెట్ పెట్టుకుని మళ్ళీ భారీ మెజార్టీ దిశగా ఎన్నికల ప్రయాణానికి జగన్ బయల్దేరుతున్న తరుణంలో వెనకనుండి జయజధ్వానాలు చేయాల్సిన సైన్యం..ముఖ్యంగా ఎమ్మెల్యేలు కొందరు ఆయనతో ప్రయాణానికి సుముఖంగా లేరు. ఆయన జైత్రయాత్రకు బయల్దేరిన రథం నుంచి దిగిపోయి ఇప్పటి వరకూ తాము ఎవరితో పోరాడుతూ వచ్చారో ఆ శత్రు పక్షాన చేరాలని చూస్తున్నారు.
లక్షల మందికి భారీగా సంక్షేమ ఫలాలు అందించిన జగన్ ఈసారి మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారని ఆయన గట్టినమ్మకంతో ఉన్నారు. ఇటు ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇంకా సొంత ఏజెన్సీలు ఇంకో ప్రయివేటు ఏజన్సీ లతో ప్రతి ఊరిని, గ్రామాన్ని, ప్రతి ఓటును జల్లెడ పట్టి రెండోసారి గెలుపునకు కావాల్సిన సాయుధ సంపత్తి జగన్ సిద్ధం చేసుకున్నా ఏమైందో కానీ ఆయన ఎమ్మెల్యేలకు మాత్రం ఆయన మీద నమ్మకం కలగడం లేదు.
కారణం ఏమైనా కానీ జగన్ వెంట తొలినుంచి ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి అడుగు బయట పెట్టడం ఓ సంచలనం.. ఇప్పుడు తాజాగా జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాయలసీమ ఎమ్మెల్యే ఇంకొకరు సైతం జగన్‌తో పడలేక టీడీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.
వైఎస్సార్ కు జగన్ కు ఎంత తేడా!
గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎమ్మెల్యేలు ఆయన్ను సునాయాసంగా కలిసేవాళ్లు.. తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఆయన కూడా తన నమ్మకస్తులను ప్రత్యేకంగా చూసుకునేవారు. కానీ జగన్ దగ్గర అందరూ ఒకటే..
ఇంకా చెప్పాలంటే ఈయన అయినవాళ్లకు ఆకుల్లోనూ కానివాళ్లకు కంచాల్లో వడ్డించే రకం.. మొదటి నుంచీ పార్టీని మోసి, కష్టనష్టాలు భరించిన వాళ్లకు మంత్రి పదవుల్లేవు..దీన జనోద్ధరకుడు అనే బిరుదు కోసం మంత్రిపదవులు చాలావరకు ఎస్సి, ఎస్టీలకు ఇచ్చారు. నేను ఎస్టీ కాలేకపోయాను అని పాణ్యం నుంచి ఆరుసార్లు గెలిచిన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కేబినెట్ కూర్పు మొదటిరోజే రోధించిన సంఘటన జగన్ నిర్ణయాలకు అద్దం పడుతోంది
అంతా సొంత నిర్ణయాలు
పార్టీలో లేదా ప్రభుత్వమూలో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే కొందరు సీనియర్లతో అయినా చర్చించాలి కానీ జగన్ మాత్రం అంతా సింగిల్.. అంతా ఆయన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నారు.. మిగతా వారికి పాత్రగాని.. ప్రమేయం కానీ ఉండడం లేదు.. దీంతో సీనియర్ మంత్రులు సైతం స్వేచ్ఛ లేక ఇబ్బందిగా మెసలుతున్నారు.
ఇలాంటి పలు అవలక్షణాలన్నీ కలగలిపి లోలోన అసంతృప్తికి కారణం అవుతున్నాయి.. ఈ చిన్న నిప్పులను జగన్ ఉఫ్ అని ఊదేసి తన కంట్రోల్లో పెట్టుకుంటారా.. ఆ చిన్న నిప్పు రవ్వలు దవానలంలా మారి పార్టీకి సెగ తగిలిస్తాయా చూడాలి