గోవాకు వెళ్లనున్న అరవింద్ కేజ్రీవాల్..! ఈడీ విచారణకు గైర్హాజరు..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం (జనవరి 18)న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆయనకు ఈడీ నాలుగుసార్లు సమన్లు జారీ చేయగా.. మూడుసార్లు విచారణకు గైర్హాజరయ్యారు. తాజాగా గురువారం సైతం విచారణకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మన్‌తో కలిసి గోవాకు మూడురోజుల పర్యటనకు వెళ్లనున్నారు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడి నుంచి గోవాకు వెళ్లనున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ ర్యాలీని సైతం నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే, ఈడీ జారీ చేసిన సమన్లపై ఆయనను ప్రశ్నించగా..‘చట్టం ప్రకారం చేయాల్సిన పనులన్నీ చేస్తా’నని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ ఢిల్లీ సీఎంను విచారించింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నది.
అయితే, ఈడీ నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, అరెస్టు చేయాలనే ఏకైక ఉద్దేశమని ఆరోపించారు. తనకు జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నిజాయితీగా, పారదర్శకంగా జీవితాన్ని గడిపానని.. దాచడానికే ఏమీ లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఆప్ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేయగా.. జైలులో ఉన్నారు. మరో వైపు ఢిల్లీ సీఎం విచారణకు హాజరుకాకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోసారి నోటీసులు జారీ చేస్తుందా..? ఏం చర్యలు తీసుకోబోతున్నదనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.