ఆదివాసీ గూడెంలకు ‘అధికార’ హుకుం.. 15 పల్లెలపై వేలాడుతున్న ‘ఖాళీ’ కత్తి?

దొరవారి తిమ్మాపురం తొలి టార్గెట్ సావైనా… బతుకైనా ఇక్కడే మా జీవితం ఆటవిక న్యాయం అమలుకు చర్యలు టైగర్ జోన్, ఐరన్ ఓర్‌కు ప్రాధాన్యత న్యూడెమోక్రసీ, మావోయిస్టుల ఆగ్రహం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసి గిరిజన గ్రామం దొరవారి తిమ్మాపురంపై ఇప్పుడు సర్కార్ కన్నుబడింది. అనుకున్నదే ఆలస్యం ఈ మారుమూల గిరిజన గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. అభివృద్ధి […]

ఆదివాసీ గూడెంలకు ‘అధికార’ హుకుం.. 15 పల్లెలపై వేలాడుతున్న ‘ఖాళీ’ కత్తి?
  • దొరవారి తిమ్మాపురం తొలి టార్గెట్
  • సావైనా… బతుకైనా ఇక్కడే మా జీవితం
  • ఆటవిక న్యాయం అమలుకు చర్యలు
  • టైగర్ జోన్, ఐరన్ ఓర్‌కు ప్రాధాన్యత
  • న్యూడెమోక్రసీ, మావోయిస్టుల ఆగ్రహం

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసి గిరిజన గ్రామం దొరవారి తిమ్మాపురంపై ఇప్పుడు సర్కార్ కన్నుబడింది. అనుకున్నదే ఆలస్యం ఈ మారుమూల గిరిజన గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పనులు అందించాలంటే కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయని శాఖలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు మాత్రం ఆగమేఘాల మీద కలిసి ముందుకు సాగుతాయి. జిల్లా రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల అధికారులు కలిసికట్టుగా ఈ అమాయక గిరిజన పల్లెను ఖాళీ చేయించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికతో కదులుతున్నారు.

గత నెలలో అధికారులంతా వెళ్లి ఈ పల్లెను ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. తరాలుగా ఈ పల్లెనూ… పల్లె చుట్టూ ఉన్న భూమిని… పరిసరాల్లోని అడవిని నమ్ముకుని నాలుగు తరాలుగా జీవిస్తున్న గిరిజనులకు ఈ తాఖీదు పిడుగుపాటుగా మారింది. గత నెల రోజులుగా కంటిమీద కునుకు లేకుండా ఆ పల్లెలోని ప్రతి గుడిసె కలవరపడుతుంది. ఆరునూరైనా పుట్టిన ఊరును వదిలేది లేదంటూ పట్టుదలతో ఉన్నారు. పిల్లల నుంచి పండు ముసలి వరకు ఒకే మాటపై నిలబడ్డారు. ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వేషన్ కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీగా మాలోతు కవిత ప్రాతినిధ్యం వహించడం మరో విశేషం.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దొరవారి తిమ్మాపురం మారుమూల అటవీ ప్రాంతం. పేరులో దొర ఉన్నప్పటికీ పేద ఆదివాసి బిడ్డలకు నిలయంగా, నాలుగు తరాలుగా దొరవారి తిమ్మాపురంలో గిరిజన బిడ్డలు కాలం వెళ్లదీస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ శివారు ఆదివాసీ కుగ్రామం దొరవారి తిమ్మాపురం.

దొరవారితిమ్మాపురం గ్రామం నైజాం పరిపాలన కంటే ముందుగానే అంటే నాలుగు తరాలుగా మొదట ఏడు ఇండ్లతో ఏర్పడి ప్రస్తుతం 22 ఇండ్లు, 25 కుటుంబాలతో 150 మంది జనాభాతో దట్టమైన అడవి మధ్యలో ఉన్నది. ఇక్కడ గిరిజన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నది. జిల్లా కేంద్రానికి సుమారు 45 KM దూరంలో ఉన్నది.

గత నెలలో అధికారుల ఆదేశం

దొరవారితిమ్మాపురం గ్రామాన్ని జిల్లా రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులు గత నెలలో సందర్శించి గ్రామాన్ని ఖాళీ చేయాలని హుకుం జారిచేశారు. గ్రామస్తులు అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… గ్రామాన్ని ఖాళీచేయమని.. గత నాలుగు తరాలుగా ఇక్కడే జీవిస్తున్నామని.. ఇక్కడి అడవితోనే మా జీవన విధానం ఆధారపడి ఉందని ప్రకృతిలో ఉన్న మమ్ములను పంజరంలో బంధించే ప్రయత్నం చేయవద్దని గ్రామంలోని అందరూ వయసుతో నిమిత్తం లేకుండా అధికారులకు తెలియజేశారు.

అసలేం జరుగుతుందనీ ఆరా!

దొరవారి తిమ్మాపురం ఆదివాసి గూడెం ఖాళీ చేయించాలని ప్రభుత్వ ఆలోచన తెలిసి రాజకీయ, ప్రజాసంఘాలు స్పందించాయి. మానుకోట జిల్లా అధికారుల సామూహిక వార్నింగ్ సమాచారం తెలిసి రాజకీయ, ప్రజాసంఘాల బృందం ఆటవీ పల్లెను సందర్శించి వాస్తవాలను బహిర్గతం చేశారు. ఆ గిరిజన పల్లెకు అండగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఈనెల మూడో తేదీన ఆ పల్లెను సందర్శించిన బృందంలో TPTF నాయకుడు మైస శ్రీనివాసులు, చుంచు శ్రీశైలం, బాలస్టీ రమేష్, కోడెం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు,TJS నాయకులు అంబటి శ్రీనివాస్,డోలి సత్యనారాయణ, బుర్రగోవర్ధన్, ఇరుగు మనోజ్ తదితరులున్నారు. ఈ బృందం పల్లెను సందర్శించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు వసతికి అడ్డంకులు

ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. గ్రామానికి వెళ్లాలంటే రెండు వాగులు దాటాల్సిందే. వర్షాకాలంలో బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఇన్ని అసౌకర్యాల నడుమ ఈ మధ్యనే తమకు కార్లయి నుండి రోడ్ సౌకర్యం క‌ల్పించ‌లేమ‌ని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరగా రోడ్డు నిర్మాణానికి అటవి శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినందున రోడ్డు సౌకర్యం కల్పించలేమని అధికారులు తెలిపారు.
సౌకర్యాలు కావాలంటే గ్రామాన్ని వేరే మైదాన ప్రాంతానికి తరలించాలని అధికారులు చెప్పడం సిగ్గుచేటు.

చ‌క్రబంధంలో బిగించే కుట్రలు

గ్రామాన్ని ఎలాగైనా ఖాళీ చేయించేందుకు రకరకాల చక్రబంధనాలు వినియోగిస్తున్నారు. ఈ గ్రామంలో రెవెన్యూ ( పట్టా భూమి )సుమారు 60 ఎకరాలు, పోడుభూమి 130 ఎకరాలు ఉన్నది. ఈ గ్రామానికి ఈమధ్యనే త్రీఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించారు. కాని గ్రామాన్ని ఖాళీ చేయమన్నందున త్రీఫేస్ కరెంటును సింగల్ ఫేస్‌గా మార్చారు. దీని వలన మోటార్లు నడవని స్థితి ఏర్పడింది. మొక్క జొన్న పంట ఎండిపోయే పరుస్థితి రాగా సింగల్ ఫేస్ తోనే మోటార్లు నడిపిస్తున్నారు. రేషన్‌ కార్డులు రద్దు చేస్తామని, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కొనసాగనివ్వమని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

టైగర్ జోన్… ఐరన్ ఓర్ కోసమా!?

గ్రామాన్ని ఖాళీ చేయించడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందనేది అందరూ భావిస్తున్నారు. ములుగు అటవీ ప్రాంతం ఆనుకుని ఉండే కొత్తగూడ, బయ్యారం, గూడూరు మండలాలను కలిపి టైగర్ జోన్‌గా ప్రకటించి ఆదివాసి గ్రామాలను మైదానం ప్రాంతాలకు తరలించాలనే కుట్రలో భాగమే ఇదంతా చేస్తున్నారని ఆరోపణ వ్యక్తం అవుతోంది.

మొదటగా కుగ్రామమైన దొరవారి తిమ్మాపురంను ఖాళీ చేయించాలని అధికారుల ఆలోచనగా అందరూ అభిప్రాయం పడుతున్నారు. అదే విధంగా బయ్యారం ఐరన్ఓర్ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉండడం కూడా ఈ గ్రామం తరలింపు ఆలోచనలో ఒక కారణంగా ఉన్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.

  • ఈ గ్రామం లోనే మూడవ తరగతి చదువుతున్న కావ్య అనే బాలిక గ్రామం తరలింపు గురించి మాట్లాడుతూ మేం అసలే ఈ గ్రామాన్ని వదలమని, మా భూములు ఇక్కడే ఉన్నాయని అన్నది. పోలీస్‌లు బెదిరింపులు మంచిది కాదని సూచించింది.

  • మేం ఎక్కడికి పోము. చావైనా బతుకైనా ఇక్కడే అని అధికారులకు స్ప‌ష్టంగా తెలిపాన‌ని గిరిజన మహిళ సమ్మక్క త‌న ఆవేద‌న వెలిబుచ్చింది.

  • మధ్య వయస్సులో ఉన్న రమేష్‌తో సంభాషించగా ప్రభుత్వం మాకు సౌకర్యాలు బందుపెట్టినా మేం కారంతో తింటూ.. బుడ్డి దీపాలతోనే గడుపుతాము తప్ప, గ్రామాన్ని ఖాళీ చేసేదిలేదని తేల్చిచెప్పారు.

  • గ్రామ పెద్ద మనిషి, గూడెం దొర లక్ష్మయ్యతో మాట్లాడగా ప్రకృతిలో ఏజీవి ఎక్కడ బతకాలో అక్కడే బతుకుతుందని.. దీనిని వేరే ప్రాంతానికి తరలిస్తే బతకలేదని.. మా ఆదివాసుల పరిస్థితి కూడా అంతేనని.. పుట్టింది ఇక్కడే మా జీవితాలు కూడా ఇక్కడేనని, మాపై అధికారులు ఎంత వత్తిడి తెచ్చినా కూడా మా ఊరును వదిలేది లేదని తెలిపారు.

గ్రామానికి తక్షణం వసతులు కల్పించాలి: రాజకీయ, ప్రజాసంఘాల బృందం

గ్రామాన్ని తరలించాలనే అధికారుల ప్రయత్నాలను మహబూబాబాద్ రాజకీయ, ప్రజాసంఘాల బృందం గ్రామాన్ని సందర్శించి ఆదివాసులకు అండగా ఉండాలని, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాలని కోరుతున్నారు. ఈ కింది డిమాండ్లు ప్ర‌భుత్వం ముందు పెట్టారు.

ఈ పరిస్థితులలో దొరవారి తిమ్మారం తరలింపును ప్రభుత్వం ఉపసంహరించుకొని తక్షణమే 6km దూరంలో ఉన్న కార్లయి గ్రామం నుండి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. వాగుల వద్ద బ్రిడ్జి లు నిర్మించాలని, తొలగించిన త్రీఫేస్ కరెంటును వెంటనే పునరుద్దరించాలని విన్నవించారు.

గ్రామంలో ఉన్న పోడు భూములను అర్హులైన వారికి పట్టాలు అందించాలని, రేషన్ షాప్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ డిమాండ్లు గ్రామస్తులు కూడా అడుగుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించిన అనంతరం త్రీఫేస్ కరెంటును పునరుద్ధరించినట్లు తెలిపారు.

ఆదివాసీలను అడవికి దూరం చేయడం అన్యాయం: సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ)

అడవిని నమ్ముకొని ఉన్న ఆదివాసీలను ఆదివాసి గూడాలను ఖాళీ చేయించడం దుర్మార్గమని సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) తీవ్రంగా విమర్శించింది. దొరవారి తిమ్మాపురం విషయంలో కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజనగూడేలని ఖాళీ చేయించడం మానుకోవాలని కోరారు.

ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడండి!: మావోయిస్టు పార్టీ

దొరవాని తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ ఆలోచనను బేషరతుగా విరమింపచేసుకునేవరకు ఆదివాసీ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఇల్లెందు – నర్సంపేట ఏరియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం కమిటీ కార్యదర్శి పాపన్న ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.

ప్రభుత్వం మాత్రం పెట్టుబడిదారులకు అమ్ముడుపోయి హరితహారం పేరుతో భూములన్నిటినీ
కబ్జాచేసి, మొక్కలు నాటుతూ మరొక పక్క బయ్యారం దగ్గర ఉక్కు, బొగ్గు, సున్నపు రాయితో పాటు అనేక రకాల ఖనిజ సంపదను పూర్తిగా పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది.

ప్రభుత్వం గ్రామాన్ని ఖాళీ చేయించే కుట్రతో ఒకపక్క నిధులు మంజూరు చేస్తూ మరొక పక్క అటవీ శాఖతో అడ్డుకట్టవేయిస్తున్నారు. మావోయిస్టులు అభివృద్ధికి ఆటంకం అని చెబుతున్న ప్రభుత్వం ఈ రోజు ప్రజలే రోడ్డుకావాలని అడిగితే ఎందుకు ఫారెస్టు వాళ్లతో అడ్డుకట్ట వేయిస్తున్నారో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గ్రామానికి రోడ్డు అడిగితే గ్రామాన్ని ఖాళీ చేసి అన్ని సామాన్లు పట్టుకొని బయటకి వెళ్లి పోవాలని అంటూ మరొక చోట పునరావాసం కల్పిస్తామని నమ్మబలుకుతున్నారు. మేము గ్రామాన్ని ఖాళీ చేయమంటే ఆర్డీవో, ఎంఆర్డీ, ఫారెస్టు అధికారులు కలిసి వారికి కరెంటు, రేషన్, నీళ్లు బందు చేసారు.

వారి పోడు వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి. రోడ్డు సౌకర్యం కల్పించి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టాలి. అభయారణ్యం పేరుతో దొరవారి తిమ్మాపురంతో పాటు కొత్తగూడెం మండలం ఉట్లమట్టెవాడ, కొంగరగిద్దె, నేలవంచ, మొట్ల తిమ్మాపురం, మడగూడెం, దొరవారి వేంపల్లి, తాటివారి వేంపల్లి, కార్లాయి, పందెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి, పోలారం, మర్రిగూడెం,ఎడిప్పల గూడెం, శంభునిగూడెంతో పాటు చాలా గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం పథకం పన్నుతున్నది.

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం పరిధిలోని దొరవారి తిమ్మాపురం గ్రామాన్ని అక్కడ ప్రజలు ఒక శతాబ్దానికి ముందే నిర్మించుకున్నారు. ఈ గ్రామం ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ 25 ఇండ్లు, వందమందికి పైగా జనాభా ఉంది. రాజకీయ నాయకులు వారితో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం కూడా ఆ గ్రామ ప్రజలకు పోడు భూములకు పట్టాలు
ఇవ్వలేదు. రోడ్డు సౌకర్యం, స్కూల్, కరెంట్‌తో పాటు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గ్రామానికి రోడ్డు వేసి, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.