మేల్కొన్న అసలు మనిషి.. యార్లగడ్డ రాజీనామా

విధాత: ఏగూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతాయ్ అని మరోమారు రుజువైంది.. మనువొకచోట.. మనసొకచోట అన్న నానుడి ఇక్కడ మళ్ళీ స్పష్టమయింది. ఎన్టీయార్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం మీద టీడీపీ వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. అటు అసెంబ్లీలోని రెండు సభల్లోనూ టీడీపీ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గట్టిగానే నిరసన తెలుపుతున్నారు. టీడీపీ సభ్యులు కాబట్టి అలా వ్యతిరేకత వెలిబుచ్చడం.. ఆందోళన […]

  • By: krs    latest    Sep 21, 2022 12:27 PM IST
మేల్కొన్న అసలు మనిషి.. యార్లగడ్డ రాజీనామా

విధాత: ఏగూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతాయ్ అని మరోమారు రుజువైంది.. మనువొకచోట.. మనసొకచోట అన్న నానుడి ఇక్కడ మళ్ళీ స్పష్టమయింది. ఎన్టీయార్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం మీద టీడీపీ వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.

అటు అసెంబ్లీలోని రెండు సభల్లోనూ టీడీపీ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గట్టిగానే నిరసన తెలుపుతున్నారు. టీడీపీ సభ్యులు కాబట్టి అలా వ్యతిరేకత వెలిబుచ్చడం.. ఆందోళన చేయడం.. ప్రభుత్వ నిర్ణయాన్ని దునుమాడడం సహజం.. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పదవికి రాజీనామా చేయడమే ఇక్కడ వింత.

వాస్తవానికి ఆయన నియామకమే పెద్ద వింత. ఆయన పూర్తిగా టీడీపీ మనిషి.. చంద్రబాబుకు.. టీడీపీ నాయకత్వానికి బాగా దగ్గరి మనిషి. వైఎస్సార్సీపీ కోసం ఏనాడూ ఓ పూట కూడా పనిచేసిన దాఖలాలు లేవు. గతంలో వాజపేయి సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన రోజుల్లో చంద్రబాబు హవా బాగానే నడిచేది. ఆ రోజుల్లో ఎల్కే అద్వానీ ఆశీస్సులతో కేంద్రంలో రాజ భాషా సంఘం అధ్యక్షుడిగా పని చేశారు.

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో రాజ భాష హిందీ అమలయ్యేలా చూడడం ఈ సంఘం విధి. అలాంటి కీలక పోష్టుల్లో కూడా ఈ ఏయూ హిందీ ప్రొఫెసర్ పని చేశారు. ఆ తరువాత కొన్నాళ్ళు ఖాళీగా ఉన్న ఈయన్ను జగన్ ఏరికోరి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో నియమించారు. ఈ నియామకం వెనుక ఏ శక్తులు పని చేసాయో ఎవరికీ తెలీదు.

కానీ జగన్ సారథ్యంలోని ప్రభుత్వంలో పని చేస్తున్నా మొత్తానికి లక్ష్మీ ప్రసాద్ మనసంతా టీడీపీతోనే ఉంటుంది అని అప్పట్లో ఆయన నియామకం సమయంలోనే వైస్సార్సీపీ సోషల్ మీడియాలో పోష్టులు వెల్లువెత్తాయి. అయినా సరే ఇన్నాళ్లుగా యార్లగడ్డ అధికార భాషా సంఘం పోష్టులో కొనసాగుతూ అప్పుడప్పుడూ జగన్ను పొగుడుతూ వచ్చారు.

సరిగ్గా ఈ యూనివర్సిటీ పేరు మార్పు సందర్భంలో ఆయనలోని అసలైన మనిషి మేల్కొన్నారు. ఎన్టీఆర్ పట్ల తనకున్న అపారమైన ప్రేమను.. అభిమానాన్ని మరోసారి చాటుకునే సమయం ఆసన్నమైందని భావించారో ఏమో గానీ తన పదవికి రాజీనామా చేశారు.

టీడీపీ వాళ్ళు గోల చేయడం.. నిరసన వ్యక్తం చేయడం పెద్దగా వింత కాదు గానీ యార్లగడ్డ వంటి వారు ప్రభుత్వంలో ఉంటూనే ఇలా రాజీనామా చేసి వెళ్లడం చూస్తుంటే అసలు ఆయన నియామకమే జగన్ చేసిన ఓ తప్పిదం అని ఇప్పుడు మరోమారు రుజువైంది.

పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న మేధావులు ఎందరో ఉండగా ఏరికోరి ఈయన్ను తెచ్చి పెట్టు కున్నందుకు సరైన సమయం చూసి సరైన తీరులో నిరసన వ్యక్తం చేసి పదవిని పక్కన పడేసి వెళ్లి పోయారని వైస్సార్సీపీ అభిమానులే కామెంట్లు చేస్తున్నారు.