యాదాద్రి అవమానంపై డిప్యూటీ సీఎం ఆత్మవంచన

యాదాద్రి దేవస్థానంలో ప్రోటోకాల్ పాటించకుండా డిప్యూటీ సీఎంను చిన్న స్టూల్‌పై కూర్చోబెట్టి అవమానించినా తానే కావాలని కింద కూర్చున్నానని చెప్పుకున్న డిప్యూటీ సీఎం భట్టికి సిగ్గు లేదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తప్పుబట్టారు

యాదాద్రి అవమానంపై డిప్యూటీ సీఎం ఆత్మవంచన
  • కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ విమర్శలు


విధాత, హైదరాబాద్‌: యాదాద్రి దేవస్థానంలో ప్రోటోకాల్ పాటించకుండా డిప్యూటీ సీఎంను చిన్న స్టూల్‌పై కూర్చోబెట్టి అవమానించినా తానే కావాలని కింద కూర్చున్నానని చెప్పుకున్న డిప్యూటీ సీఎం భట్టికి సిగ్గు లేదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తప్పుబట్టారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రోటోకాల్ పాటించకుండా కింద కూర్చోపెట్టినా సిగ్గులేకుండా నేనే కూర్చున్న అని భట్టి చెప్పడం ద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడని విమర్శించారు.


భట్టి తమ పార్టీ నాయకుడు కాబట్టి ఉరుకున్నానని, లేదంటే బాధ్యులై అట్రాసిటీ కేసు పెట్టేవాడినని చెప్పారు. భట్టి అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని, అలా దిగజారే కింద కూర్చున్నాడని ఆరోపించారు. తానే భట్టి స్థానంలో ఉంటే రేవంత్‌, కోమటిరెడ్డి, ఉత్తమ్‌లను లేపి అయినా కూర్చునేవాడనని, లేకపోతే లేచి బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయేవాడినని చెప్పుకొచ్చారు.


కాగా.. జీవో 46 బాధితుల్లో ఖమ్మం వారు కూడా ఉన్నారని, మరి డిప్యూటీ సీఎం ఆ జీవో రద్దుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళితుడైన భట్టి ఒక్క దళితుడికి నామినేటెడ్ పదవులు ఇప్పించలేదని, కాని తాను శాసించే స్థాయిలో ఉన్నానని అంటున్నాడని, ఏమీ శాసిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రచార ప్రకటనలలోనూ భట్టి ఫోటో తీసేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడి ఫోటోనే వేసుకుంటున్నారని, అంటే రేవంత్ మొహం చూసే ఓట్లు పడ్డాయని అనుకోవాలా అని సెటైర్లు వేశారు.